ఫ్రెంచ్ కంపెనీలు వచ్చేలా చొరవ చూపాలి.. ‘ఇఫ్కీ’ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ

by Ramesh Naini |

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేలా ఫ్రెంచ్ కంపెనీలను ప్రోత్సహించాలని ‘ఇఫ్కీ’ ప్రతినిధులను మంత్రి శ్రీధర్ బాబు కోరారు.

ఫ్రెంచ్ కంపెనీలు వచ్చేలా చొరవ చూపాలి.. ‘ఇఫ్కీ’ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: భావితరాల అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేలా ఫ్రెంచ్ కంపెనీలను ప్రోత్సహించాలని ‘ఇఫ్కీ’ ప్రతినిధులను మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) కోరారు. మంగళవారం అంబేడ్కర్ సచివాలయంలో ఇఫ్కీ (Indo-French Chamber of Commerce and Industry) ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకున్న అనుకూలతలు, ప్రభుత్వం తరఫున అందిస్తున్న ప్రోత్సాహాకాలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. తెలంగాణ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేయాలనే దూరదృష్టితోనే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) 30 వేల ఎకరాల్లో పీపీపీ విధానంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి శ్రీకారం చుట్టారని తెలిపారు.

అంతర్జాతీయ భాగస్వామ్యంతో ఈ నగరాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలన్నదే మా సంకల్పమని వివరించారు. ఏడాదిన్నర వ్యవధిలోనే తెలంగాణకు రూ.3 లక్షల కోట్ల పెట్టబడులొచ్చాయన్నారు. గతేడాది హైదరాబాద్ లో 70 జీసీసీలు ప్రారంభమయ్యాని, పారిశ్రామికవేత్తలకు మా ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని చెప్పారు. ‘ఏరో స్పేస్, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ లాంటి రంగాల్లో పలు ఫ్రెంచ్ కంపెనీలు ఇప్పటికే తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయన్నారు. సనోఫి, మోనిన్, సఫ్రాన్, క్యాప్ జెమినీ, డసాల్ట్, టెలి పర్ఫార్మెన్స్, ఓపెల్లా హెల్త్ కేర్ లాంటి దిగ్గజ సంస్థలు తమ కార్యకలాపాలను ఇక్కడ నిర్వహిస్తున్నాయని అన్నారు.

ఎమర్జింగ్ టెక్నాలజీస్, క్లీన్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, డిజిటల్ గవర్నెన్స్, ఆగ్రో ఇన్నోవేషన్, స్మార్ట్ హెల్త్ సిస్టమ్స్, ఫ్యూచర్ రెడీ ఎడ్యుకేషన్, సస్టైనబుల్ మ్యానుఫాక్చరింగ్ తదితర రంగాల్లో మంచి అవకాశాలున్నాయని, దీన్ని ఫ్రాన్స్ (French companies) పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకునేలా చొరవ చూపాలని ఇఫ్కీ ప్రతినిధులను కోరారు. ‘తెలంగాణ – ఫ్రెంచ్’ (Telangana – French) మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

Next Story