నార్వే కంపెనీలను ప్రోత్సహించండి: మంత్రి శ్రీధర్‌బాబు

by Gantepaka Srikanth |

లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.

నార్వే కంపెనీలను ప్రోత్సహించండి: మంత్రి శ్రీధర్‌బాబు
X

దిశ, తెలంగాణ బ్యూరో: లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఆయా రంగాల్లో రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేసేలా నార్వే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని ఆ దేశ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని కోరారు. సెక్రెటేరియట్‌లో మంగళవారం ఆ దేశ రాయబారి మే ఎలిన్ స్టెనర్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం మంత్రితో ప్రత్యేకంగా భేటీ అయ్యింది. తెలంగాణ-నార్వే దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సమగ్రంగా చర్చించింది. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యలను, ఈజ్ ఆఫ్ డూయింగ్ పాలసీలను, పరిశ్రమల ఏర్పాటుకున్న అనుకూలతలు, అవకాశాలను మంత్రి వివరించారు. క్లీన్ ఎనర్జీ, సుస్థిర మౌలిక సదుపాయాల కల్పన, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఆఫ్‌షోర్ విండ్, క్లైమేట్ ఇన్నోవేషన్, గ్రీన్ మ్యాన్యుఫ్యాక్చరింగ్, ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వ్యవస్థలలో నార్వే గ్లోబల్ లీడర్ గా కొనసాగుతున్నదని కొనియాడారు.

ఏఐ, క్లైమేట్ టెక్, హెల్త్ టెక్, డీప్ టెక్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ పబ్లిక్ సర్వీసెస్, గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, క్లీన్ ఎనర్జీ, ఇండస్ట్రియల్ డీ కార్బనైజేషన్, గ్రీన్ మ్యాన్యుఫ్యాక్చరింగ్, డిజిటల్ హెల్త్, బయోటెక్, మెడికల్ డివైజెస్ తదితర అంశాల్లో కలిసే పని చేసేందుకు గల అవకాశాలపై కాంప్రహెన్సివ్ రోడ్డు మ్యాప్‌ను సిద్ధం చేసుకుని ముందుకెళ్తామన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా తెలంగాణ-నార్వే వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేద్దామని మంత్రి ప్రతిపాదించారు. తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రాలతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని.. వర్కింగ్ గ్రూప్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని నార్వే రాయబారి మే ఎలిన్ స్టెనర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో నార్వే ఇన్నోవేషన్ హెడ్ బ్యోర్న్ ఐవర్సన్, ఫస్ట్ సెక్రటరీ సిల్జే క్రిస్టీన్ ఆండర్సన్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ సిరి వెసెత్ మెలింగ్ తదితరులు పాల్గొన్నారు.

అడ్వాన్డ్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌లో పెట్టుబడులు..

అడ్వాన్స్డ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో పరిశ్రమల ఏర్పాటుకు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అత్యంత అనుకూలమని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేలా ఇటలీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని ఆ దేశ ప్రతినిధులను కోరారు. ఇటలీ దేశ రాయబారి ఆంటోనియో బార్టోలి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం మంగళవారం మంత్రి శ్రీధర్‌బాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యింది. ఈ సందర్భంగా ఏయే రంగాల్లో తెలంగాణ-ఇటలీ కలిసి పనిచేసేందుకు అవకాశాలున్నాయనే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఇండస్ట్రీ 4.0, రోబోటిక్స్, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, క్లీన్ మొబిలిటీ, రెన్యూవబుల్ ఎనర్జీ తదితర రంగాల్లో ఇటలీ మార్గదర్శకం తెలంగాణ బ్రాండ్‌ను మరింత విశ్వవ్యాప్తం చేసేందుకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణకు నమ్మకమైన భాగస్వామిగా మారుతామని.. కీలక రంగాల్లో కలిసి పని చేస్తామని ఇటలీ రాయబారి ఆంటోనియో బార్టోలి పేర్కొన్నారు.

Next Story