ఆ పరిశ్రమలను పునరుద్ధరించండి : కేంద్రమంత్రిని కోరిన శ్రీధర్ బాబు

by Muthe.Rajitha |

తెలంగాణలో మూతపడిన రెండు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పునరుద్ధరణకు చొరవ చూపాలని కేంద్రమంత్రికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) విజ్ఞప్తి చేశారు.

ఆ పరిశ్రమలను పునరుద్ధరించండి : కేంద్రమంత్రిని కోరిన శ్రీధర్ బాబు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో మూతపడిన రెండు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పునరుద్ధరణకు చొరవ చూపాలని కేంద్రమంత్రికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) విజ్ఞప్తి చేశారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామిని(HD Kumaraswamy) కలిసి ఆ మేరకు వినతి పత్రం సమర్పించారు. పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన ద్వారా జాతీయ స్థూల దేశీయోత్పత్తి(GDP)కి గణనీయంగా దోహదపడాలన్నదే మా ప్రభుత్వ సంకల్పం అన్నారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా తెలంగాణలో మూతపడిన పరిశ్రమల పునరుద్ధరణపై దృష్టి సారించామని పేర్కొన్నారు.

పెద్దపల్లిలోని రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(RFCL) విజయవంతంగా నడుస్తోందని, ఇదే మాదిరిగా ఆదిలాబాద్ జిల్లాలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI), భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలోని స్పాంజ్ ఐరన్ ఇండియా లిమిటెడ్ (SIIL)ను పునరుద్ధరిస్తే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామికాభివృద్ధికి మేలు జరుగుతుందని వివరించారు. ఈ పరిశ్రమలు పునరుద్ధరిస్తే స్థానిక ప్రజలకు ఉపాధి లభిస్తుందని, ఆ దిశగా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. తమ విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి కుమార స్వామి సానుకూలంగా స్పందించారని, ఆ రెండు పరిశ్రమల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని మంత్రి శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story