‘మోసపోకండి’.. మంత్రి శ్రీధర్ బాబు పిలుపు

by Gantepaka Srikanth |

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాలకు భంగపాటు తప్పదని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

‘మోసపోకండి’.. మంత్రి శ్రీధర్ బాబు పిలుపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాలకు భంగపాటు తప్పదని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం చేసే పార్టీ కాంగ్రెస్​అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం సోమాజిగూడ డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలు, బస్తీల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా ఆయన ఆదివారం విస్తృత ప్రచారం నిర్వహించారు. అపార్ట్ మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల అసోసియేషన్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హైదరాబాద్ మహా నగరాభివృద్ధికి గత కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు, చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టుల గురించి ఓటర్లకు వివరించారు. నగరాభివృద్ధికి, స్థానిక సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన భవిష్యత్తు కార్యాచరణపై సలహాలు సూచనలు స్వీకరించారు. కొన్ని ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లను నిర్మించి మొత్తం నగరాన్ని అభివృద్ధి చేశామంటూ గొప్పలు చెప్పుకున్నారని మంత్రి విమర్శించారు.

క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి వేరని, ఇప్పటికీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని చాలా కాలనీలు, బస్తీల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు లేవని శ్రీధర్​బాబు అన్నారు. రెండేళ్లలో ప్రజా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారన్నారు. అయినా... తమ ఉనికిని కాపాడుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ బురద జల్లే రాజకీయాలకు పాల్పడుతున్నాయన్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించే చిత్తశుద్ధి కాంగ్రెస్ అభ్యర్థికి మాత్రమే ఉందన్నారు. పది మందికి మంచి చేయాలనుకునే నవీన్ యాదవ్ గెలిస్తే ఈ నియోజవర్గానికి మంచి జరుగుతుందని శ్రీధర్ బాబు తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని జూబ్లీహిల్స్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సంక్షేమం, అభివృద్ధి అజెండాగా ముందుకు సాగుతున్న ఈ ప్రజా ప్రభుత్వానికి అండగా నిలవాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

Next Story