పెట్టుబడులపై విషప్రచారం ఆపండి: సభలో మంత్రి శ్రీధర్ బాబు ఫైర్

by Ramesh Naini |

పెట్టుబడులపై విపక్షాలు చేస్తున్న విష ప్రచారం సరికాదని, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తుంటే ఓర్వలేకపోతున్నారని, స్వార్థ రాజకీయాల కోసం మాపై కోపంతో చేసే ఈ తప్పుడు ప్రచారం రాష్ట్రానికి మంచిది కాదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు.

పెట్టుబడులపై విషప్రచారం ఆపండి: సభలో మంత్రి శ్రీధర్ బాబు ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పెట్టుబడులపై విపక్షాలు చేస్తున్న విష ప్రచారం సరికాదని, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తుంటే ఓర్వలేకపోతున్నారని, స్వార్థ రాజకీయాల కోసం మాపై కోపంతో చేసే ఈ తప్పుడు ప్రచారం రాష్ట్రానికి మంచిది కాదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. గురువారం శాసనసభలో సభ్యులు కాటిపల్లి వెంకటరమణా రెడ్డి, పాయల్ శంకర్, ధన్ పాల్ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, 2024, 2025 దావోస్ పర్యటనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి మొత్తం 44 ఎంవోయూలను వివిధ కంపెనీలతో కుదుర్చుకుందని, ఈ పెట్టుబడుల గ్రౌండింగ్ వివిధ దశల్లో ఉన్నాయని, ఫలితంగా కొత్తగా 68,150 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుందని తెలిపారు.

ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో ఫ్యాక్టరీలు

ఆదిలాబాద్‌లో సిమెంట్ ఫ్యాక్టరీ, ఖమ్మం జిల్లాలో స్పాంజి ఐరన్ పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ కోసం పాయల్ శంకర్ తో కలిసి చాలా సార్లు కేంద్ర మంత్రిని కలిశామని గుర్తు చేశారు. ఖమ్మంలో స్పాంజ్, ఐరన్ పరిశ్రమ ఏర్పాటుపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, భట్టి విక్రమార్కలతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీనిపై త్వరలోనే కేంద్ర మంత్రి ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు. టైర్ - 2, టైర్ - 3 పట్టణాలు, నగరాల్లో పారిశ్రామికాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, పదేళ్ల తర్వాత ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ఆధ్వర్యంలోని మా ప్రజా ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అన్ని ఐటీ టవర్లలో పనిచేస్తున్నవారు హైదరాబాద్ పై ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. అన్ని ఐటీ టవర్లకు మరో మూడేండ్ల పాటు రెంటల్ చార్జీలను మినహాయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

టీ-ఫైబర్ పై కేంద్రం ప్రశంసలు..

‘లాస్ట్ మైల్ కనెక్టివిటీలో మన ‘టీ - ఫైబర్’ను దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఓ రోల్ మోడల్ గా నిలిపాం. ఇది మేం చెప్పింది కాదు. సాక్షాతూ కేంద్రమే చెప్పింది. రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలు, ప్రభుత్వ కార్యాలయాలకు ‘టీ - ఫైబర్’ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించాం. గతంలో సెక్రటేరియట్ లో ప్రైవేటు సంస్థ ద్వారా ఇంటర్నెట్ అందించేవారని, కానీ మా ప్రభుత్వం వచ్చినా తర్వాత టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ అందిస్తున్నాం’ అని తెలిపారు.

2001లో 294 ఎమ్మెల్యేల విదేశీ పర్యటనలు..

‘2001 కొత్తగా ఎమ్మెల్యే అయ్యాను. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు 294 మంది శాసనసభ్యులను విదేశీ పర్యటనలకు తీసుకెళ్లారు. ఆ అనుభవం ఎంతో ఉపయోగపడింది. మూసీ సుందరీకరణ కోసం దక్షిణ కొరియాలో అధ్యయనం నగరానికి చెందిన అన్ని పార్టీలకు సభ్యులను ఆహ్వానించాం. చాలామంది రాలేదు. మా సభ్యులు సొంత ఖర్చులతో వెళ్లారు. దీనిపై ప్రతిపక్ష సభ్యుల విమర్శలు సరికావు’ అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

ఐటీ టవర్లపై ప్రభుత్వం నిర్లక్ష్యం : హరీశ్‌రావు

ఐటీ రంగాన్ని హైదరాబాద్ లోనే కాదని, టైర్-2 పట్టణాల్లోనూ విస్తరించి యువతకు ఉద్యోగాలు కల్పించాలని బీఆర్ఎస్ వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, సిద్దిపేట ఐటీ టవర్లను ఏర్పాటు చేసిందని, వీటిని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని హరీశ్‌రావు విమర్శించారు. సిద్ధిపేట ఐటీ టవర్ లో బీఆర్ఎస్ హయాంలో 18 కంపెనీలు పని చేస్తే ఇప్పుడు 7 కంపెనీలు వెళ్ళిపోయి 11 మాత్రమే కంపెనీలు పని చేస్తున్నాయని తెలిపారు. నెట్ బిల్లు చెల్లించక పోవడంతో ఐటీ టవర్ కు ఇంటర్నెట్ కట్ చేశారని, ఐటీ టవర్ మెయింటైన్ అవుట్ సోర్సింగ్ కంపెనీకి బిల్లులు చెల్లించకపోవడంతో అక్కడున్న స్వీపర్, వాచ్ మెన్, తదితర స్టాఫ్ కి 4 నెలలుగా జీతాలు రాని పరిస్థితి ఉందని తెలిపారు. మూడేండ్ల పాటు ఆ కంపెనీలకు ఫ్రీ రెంటల్ ఫెసిలిటీ కల్పించామని, ఇప్పుడిప్పుడే అవి నిలదొక్కుంటున్నాయని, మరో మూడేండ్ల పాటు ఫ్రీ రెంటల్ ఫెసిలిటీ కొనసాగించాలని కోరారు.

Next Story