కాంగ్రెస్ అభివృద్ధి కేసీఆర్ కు కనబడటం లేదా? : మంత్రి శ్రీధర్ బాబు ఫైర్

by Muthe.Rajitha |   (  Updated:2025-12-22 12:29:56  IST  )

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రెండేళ్లపాటు చేసిన అభివృద్ధి కేసీఆర్ కు కనబడకపోవడం విడ్డూరంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు.

కాంగ్రెస్ అభివృద్ధి కేసీఆర్ కు కనబడటం లేదా? : మంత్రి శ్రీధర్ బాబు ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రెండేళ్లపాటు చేసిన అభివృద్ధి కేసీఆర్ కు కనబడకపోవడం విడ్డూరంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. నేడు హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించిన శ్రీధర్ బాబు.. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా కేసీఆర్‌ నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని అన్నారు. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలు, మరోవైపు ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కల్పనకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. జరుగుతున్న అభివృద్ధిని కేసీఆర్‌ ఎందుకు చూడలేకపోతున్నారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.

కేసీఆర్‌ హయాంలో కూడా అనేక ఒప్పందాలు జరిగాయని గుర్తు చేస్తూ, రాష్ట్రానికి పెట్టుబడులు రావడం అనేది ఎప్పటికీ కొనసాగే నిరంతర ప్రక్రియ అని తెలిపారు. కంపెనీలు తమకు అనుకూలమైన వాతావరణం ఉన్న రాష్ట్రాల్లోనే పెట్టుబడులు పెడతాయని, అందుకే పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం అనుకూల విధానాలతో ముందుకెళ్తోందని మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్‌కు రావడానికి అనేక అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు ఆసక్తి చూపుతున్నాయని, ఒక్క ఏడాదిలోనే 75 గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్లను తీసుకొచ్చామని తెలిపారు.

అత్యధిక జీసీసీలు వచ్చిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు. గత ఏడాది రూ.3.40 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్లు వెల్లడిస్తూ, కొత్త పెట్టుబడుల వల్ల 1.40 లక్షల మంది ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలు కలగనున్నాయని అన్నారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసిందని, ప్రపంచ అవసరాల్లో మూడొంతుల వ్యాక్సిన్లు హైదరాబాద్‌ నుంచే ఎగుమతి అవుతున్నాయని చెప్పారు.

Next Story