హిట్లర్ అనే పదాన్ని సీఎం అందుకే వాడారు : రాష్ట్ర మంత్రి శ్రీధ‌ర్ బాబు

by Naga Rani Yarlagadda |

ఏదైనా ప‌ని చేప‌డితే దాన్ని ఎలాగైనా సాధించే వారిని హిట్లర్ అంటారని, సీఎం ఒక ల‌క్ష్యం, క్రమ‌శిక్షణ‌తో పోవాల‌ని హిట్లర్ అనే ప‌దాన్ని వాడారని, హిట్లర్ అనే ప‌దం సీఎం మాట్లాడిన సంద‌ర్భం వేరు అని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

హిట్లర్ అనే పదాన్ని సీఎం అందుకే వాడారు : రాష్ట్ర మంత్రి శ్రీధ‌ర్ బాబు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఏదైనా ప‌ని చేప‌డితే దాన్ని ఎలాగైనా సాధించే వారిని హిట్లర్ అంటారని, సీఎం ఒక ల‌క్ష్యం, క్రమ‌శిక్షణ‌తో పోవాల‌ని హిట్లర్ అనే ప‌దాన్ని వాడారని, హిట్లర్ అనే ప‌దం సీఎం మాట్లాడిన సంద‌ర్భం వేరు అని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. క‌బ్జాదారుల గుండెల్లో భ‌యం పుట్టిస్తుంటే ఓర్వలేక ఏం మాట్లాడో తెలియ‌క కొంద‌రు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని, దాన్ని నాజీ హిట్లర్ తో పోల్చడం స‌రికాదు, హిట్లర్ పాటించిన సిద్ధాంతాల‌ను పాటిస్తామ‌ని తమ సీఎం చెప్పలేదని మంత్రి స్పష్టం చేశారు. సోమవారం సీఎల్పీలోని మీడియా సెంటర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీధర్ బాబు మాట్లాడుతూ హైడ్రా చ‌ట్టప‌రిధిలో ప‌నిచేస్తోందని, చెరువుల‌ను క‌బ్జా దారుల‌నుంచి కాపాడాలంటే ఒక ఉక్కు సంకల్పం అవ‌స‌రం, ఆ ఉక్కు సంక‌ల్పం గురించి చెప్పడానికి హిట్లర్ అనే ప‌దం వాడారన్నారు. గ‌తంలో కూడా కేసీఆర్ తాను హిట్లరే అని వ్యాఖ్యానించారని, ఆ మాట‌లు అన్న కేసీఆర్ హిట్లర్ సిద్ధాంతాన్ని అమ‌లు ప‌ర్చారా? కేటీఆర్ వాళ్ల నాన్నను అడగాలని శ్రీధర్ బాబు హితవు పలికారు. చిరంజీవి హీరోగా హిట్లర్ అనే సినిమా వ‌చ్చింది, హిట్లర్ సినిమా ప్రధాన ఉద్దేశం వేరని, రెండో ప్రపంచ యుద్దానికి కార‌ణ‌మైన హిట్లర్ నియంత‌..ఆయ‌న వేరు జ‌న‌భాహుళ్యంలోని హిట్లర్ పేరు వేరని మంత్రి స్పష్టం చేశారు. పదేళ్ల పాటు కేసీఆర్ సెక్రటేరియ‌ట్ కు రాలేదు, ప్రగ‌తి భ‌వ‌న్ కు ఎవ‌రిని రానివ్వలేదు, స్వయంగా మంత్రులు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల‌కు కూడా రానివ్వలేదని, నాజీలు పెట్టిన హిట్లర్ బంక‌ర్ లా ప్రగ‌తి భ‌వ‌న్ ఉండేది, వాటిని మేం తొల‌గించామని శ్రీధర్ బాబు తెలిపారు. తాపీ మేస్త్రీకి త‌ల‌పోటు వ‌స్తే గోడ కూల్చిన‌ట్లుగా కేటీఆర్ వ్యవ‌హార‌శైలి ఉందని, తమ ప్రభుత్వ ప‌నుల‌ను చూసి బీఆర్ఎస్ గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్, కేటీఆర్ ప్రజాస్వామిక విలువల గురించి మాట్లాడటం అంటే గురువింద గింజ త‌న కింద న‌లుపు ఎరుగ‌న‌ట్లే అని, కేటీఆర్ అంబేద్కర్ గురించి మాట్లాడం అంటే శ‌తాబ్దపు జోక్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయ‌డం ప్రజాస్వామ్యమా? నీళ్లు, నియామ‌కాలు, నిధులు గ‌త ప‌దేళ్లలో సాధించారా? నియామ‌కాలు వాళ్లకు, నిరుద్యోగుల‌కు ఆ నాడు ఉద్యోగాలు వ‌చ్చాయా? తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఎలా ప‌నిచేసిందో, పేప‌ర్లు ఎలా అమ్ముడుపోయాయో తెలియ‌దా? అని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. ల‌క్షలాది మంది విద్యార్థుల జీవితాల‌ను అన్యాయం చేసింది నిజం కాదా? తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీ స్ క‌మిష‌న్ తాము సంస్కరించామన్నారు.

కేటీఆర్ స‌మానత్వం గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్లుంది..

కేటీఆర్ స‌మానత్వం గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్లుందని, అంబేద్కర్ ర‌చించిన రాజ్యాంగం ప్రకార‌మే హైడ్రా నోటీసులు ఇచ్చి యాక్షన్ తీసుకుంటోందని, బీఆర్ఎస్ హ‌యాంలో ప్రభుత్వ భూములు క‌బ్జాకు గురైతే ఏ మాత్రం ప‌ట్టించుకోలేదని మంత్రి మండిపడ్డారు. హైడ్రా ఒక ఉక్కు సంకల్పంతో చెరువులను, ప్రభుత్వ భూముల‌ను కాపాడుతుంటే స‌రికాద‌ని అంటున్నారని, చెరువుల‌ను కాపాడుతుంటే ఆ ప్రాంత ప్రజ‌లు హ‌ర్షం వ్యక్తం చేస్తున్నారని శ్రీధర్ బాబు తెలిపారు. బీఆర్ఎస్ నాయ‌క‌త్వమే బాధ క‌నిపిస్తోందని, ప్రభుత్వ భూముల‌ను క‌బ్జా నుంచి ర‌క్షిస్తే బీఆర్ఎస్ నాయ‌కులు ఎందుకు బాధ‌ప‌డుతున్నారు? హైద‌రాబాద్ ను అంత‌ర్జాతీయ న‌గ‌రంగా చేయాల‌ని, ప్రజ‌ల‌కు ప‌రిశ్రభ‌మైన నీళ్లు, గాలి అందించాల‌ని సీఎం ప్రయ‌త్నం చేస్తున్నారని, సీఎం రేవంత్ రెడ్డి ప్రయ‌త్నాల‌ను న‌గ‌ర ప్రజ‌లు స్వాగతిస్తున్నారన్నారు. తమ డీఎన్ఏలో హింస లేదని, దాన్ని స‌హించం, బీఆర్ఎస్ తాలిబాన్ విధానంలో ప‌నిచేస్తే అంద‌రూ అదే విధంగా ప‌నిచేస్తారని అనుకుంటోదని, అహంకారంపైన తిరగ‌బ‌డి తెలంగాణ స‌మాజం వారిని గ‌ద్దె దింపిందని మంత్రి ఫైర్ అయ్యారు.

అస‌త్య ప్రచారాలు చేసుకుంటు హ‌రీష్ రావు ఊరూరు తిరుగుతున్నారు..

అస‌త్య ప్రచారాలు చేసుకుంటు హ‌రీష్ రావు ఊరూరు తిరుగుతున్నారని, ఆయన అస‌త్య ప్రచారాల‌ను తెలంగాణ ప్రజ‌లు న‌మ్మరు, త‌ప్పుడు లెక్కల‌తో ప్రజ‌ల‌ను ప‌క్కదారి ప‌ట్టించ‌డానికి హ‌రీష్ రావు ప్రయ‌త్నం చేస్తున్నాడని శ్రీధర్ బాబు మండిపడ్డారు. వాళ్లు ప‌దేళ్లలో చేయ‌లేని ప‌నుల‌ను మా రెండున్నర ఏళ్లలో చేశామని, ఉద్యమ స‌మ‌యంలో 1200 మంది అమ‌ర‌వీరులని చెప్పి కేవ‌లం 400 మందినే గుర్తించారని మంత్రి విమర్శించారు. కాంగ్రెస్ పైన ఎందుకు ప్రజ‌లు విసిగిపోయారు? దేని గురించి విసిగిపోయారు? హరీష్ రావు చెప్పాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. హ‌రీష్ రావు వంద సీట్లు అని చెప్పుకుంటున్నాడు బీఆర్ఎస్ కు 10 సీట్లు కూడా రావని శ్రీధర్ బాబు ఎద్దేవా చేశారు. పోలీసుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం క‌ట్టుబ‌డి ఉందని, పోలీసుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. అస‌త్య ప్రచారం కోసం బీఆర్ఎస్ కు సోష‌ల్ మీడియా ప్రధాన ఆయుధంగా మారిందని, స‌మాజంలో సోష‌ల్ మీడియాలో విద్వేషాలు పెంచుతున్నారని శ్రీధర్ బాబు మండిపడ్డారు. పోలీసుల పేరు పెట్టి హ‌రీష్ రావు స‌మావేశంలో బ‌హిరంగంగా హెచ్చరిస్తున్నాడని, మాజీ మంత్రి స్థాయిలో హ‌రీష్ రావు హుందాత‌నానికి ఇది త‌గ‌దని మంత్రి హితవు పలికారు. ఉచిత క‌రెంటు నిలిపివేయ‌డానికి రైతు డిస్కం తెచ్చార‌ని హ‌రీష్ రావు త‌ప్పుడు ప్రచారం చేస్తున్నారని, రైతుల‌కు మేలు చేయ‌డానికే రైతు డిస్కం తీసుకువ‌స్తామ‌ని సీఎం స్పష్టంగా చెప్పారన్నారు. ప‌రిపాల‌న సౌల‌భ్యం కోస‌మే రైతు డిస్కం తీసుకువ‌స్తున్నామని, తమ కాంగ్రెస్ ప్రవేశ‌పెట్టిన ఉచిత విద్యుత్ ను త‌ప్పనిస‌రిగా కొన‌సాగిస్తామని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. రైతుల‌కు ప‌గ‌టి పూట మాత్రమే ఉచిత విద్యుత్ ఇస్తార‌ని హ‌రీష్ రావుకు ఎవ‌రు చెప్పారు? అని మంత్రి నిలదీశారు.

బీఆర్ఎస్ హాయాంలో కార్మికులకు ఇచ్చిన హామీలో ఏదీ అమ‌లు చేయ‌లేదు..

బొగ్గు గ‌నుల వేలంలో సింగ‌రేణిని పాల్గొన‌కుండా అడ్డంకులు సృష్టించి వాళ్ల మిత్రుల ప్రైవేట్ సంస్థల‌కు అప్పగించింది వాస్తవం కాదా? కోయ‌గూడెం బ్లాక్ 3, స‌త్తుప‌ల్లి బ్లాక్ 3 బొగ్గు గ‌నులు సింగ‌రేణికి ద‌క్కకుండా పోయిందని, దీని వ‌ల్ల 2000 కోట్ల ఆదాయం రాకుండా పోయిందని, దీనికి బాధ్యత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని శ్రీధర్ బాబు ఆరోపించారు. సింగ‌రేణిలో బీఆర్ఎస్ హ‌యాంలో 40 వేల కోట్ల బొగ్గు, విద్యుత్ బ‌కాయిలు పెట్టిపోయారని, వారి హాయాంలో కార్మికులకు ఇచ్చిన హామీలో ఏదీ అమ‌లు చేయ‌లేదని శ్రీధర్ బాబు విమర్శించారు. బీఆర్ఎస్ హ‌యాంలో ఉన్న కాంట్రాక్టర్లే ఇప్పుడు కూడా సింగ‌రేణిలో ఉన్నారని, కేసీఆర్ బంధు మిత్రులు, బీఆర్ఎస్ కు సంబంధించిన కాంట్రాక్టర్లే ఎక్కువ మంది ఇందులో ఉన్నారన్నారు. సింగ‌రేణి చ‌రిత్రలో ఎప్పుడు లేని విధంగా మెడిక‌ల్ బోర్డు పైన గ‌తంలో వివాదం నెల‌కొన్నదని, ఈ అంశం పైన డీప్యూటీ సీఎం సింగ‌రేణి అధికారుల‌తో స‌మీక్షించారని, న్యాయ‌ప‌రంగా ముందుకు వెళ్తామ‌ని చెప్పారని మంత్రి తెలిపారు. బొగ్గు నిల్వల పైన వాళ్ల హ‌యాంలో ఏం జరిగిందో అంతా బ‌య‌ట‌కు రావాలని, దీనిపైన విచార‌ణ జ‌ర‌గాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. సింగ‌రేణి కార్మికుల‌ను ఎప్పుడు తాము మోసం చేయమన్నారు. నైని బొగ్గు గ‌నుల‌పైన సింగ‌రేణి పార‌ద‌ర్శకంగా ముందుకు పోతుందని, గోబెల్స్ ప్రచారం మానుకోక‌పోతే బీఆర్ఎస్ కి ప్రతిప‌క్ష హోదా కూడా రాదని శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు.

Next Story