Sridhar Babu: వెనక్కి తగ్గేదే లేదు.. మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

సాధారణంగానే ఏదైనా మంచి పని చేసేటప్పుడు కొందరూ కావాలనే అడ్డుపడుతుంటారుని, దాని విషయంలోనూ ఇదే జరుగుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

Sridhar Babu: వెనక్కి తగ్గేదే లేదు.. మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: సాధారణంగానే ఏదైనా మంచి పని చేసేటప్పుడు కొందరూ కావాలనే అడ్డుపడుతుంటారుని, మూసీ (Musi River) విషయంలోనూ ఇదే జరుగుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) కీలక వ్యాఖ్యలు చేశారు. భావి తరాల కోసం మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని, వెనక్కి తగ్గేదే లేదు అని ఆయన తేల్చి చెప్పారు. నీటి వనరుల పరిరక్షణలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణను రోల్ మోడల్ గా నిలుపుతామని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఇన్సిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఇండియా (ఐటీపీఐ) తెలంగాణ స్టేట్ రీజినల్ ఛాప్టర్ ఆధ్వర్యంలో శనివారం బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ లో ‘పాలసీస్ అండ్ స్ట్రాటజీస్ టువార్డ్స్ బయోఫిలిక్ అర్బనిజం’ అనే అంశంపై ఏర్పాటు చేసిన సౌత్ జోన్ కాన్ఫరెన్స్‌ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. నగరాల అభివృద్ధికి సరైన ప్రణాళికే పునాది అని అన్నారు. పర్యావరణం, సుస్థిరత లేకుండా ఆర్థికాభివృద్ధి సాధ్యం కాదన్నారు. భవనాలను నిర్మించడమే అభివృద్ధి కాదని, ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణతో కూడిన వృద్ధి ఆవశ్యకమన్నారు. ఆర్థిక భవిష్యత్తుకు పట్టణ ప్రణాళికే పునాది అని నొక్కి చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం అభివృద్ధి, కార్బన్ – న్యూట్రల్ గ్రోత్, జల సంరక్షణ, సుస్థిర రవాణాలో తెలంగాణ అవలంభిస్తున్న విధానాలు, తీసుకున్న చర్యలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకుంటే సుస్థిరాభివృద్ధితో కూడిన నగరాలను అభివృద్ధి చేయోచ్చన్నారు. వాతావరణ మార్పులు, పట్టణ వరదలు, పర్యావరణ కాలుష్యం, భూగర్భ జలాల తరుగుదల, పట్టణీకరణ, తరిగిపోతున్న పచ్చదనం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని నగర ప్రణాళికలను రూపొందించాలని సూచించారు.

Next Story