- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉదయం 11 నుంచి 3 వరకు బయటకు రావొద్దు.. ప్రజలకు మంత్రి సీతక్క కీలక సూచనలు
రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజా భవన్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం తీవ్ర ఎండల పరిస్థితులు నెలకొన్నందున ప్రజలు ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు రావొద్దని మంత్రి సూచించారు. అత్యవసర పనులు ఉంటే ఉదయం 6 నుండి 10 గంటల మధ్యలో పూర్తి చేసుకుని మిగిలిన సమయాల్లో ఇంటి వద్దే ఉండటం శ్రేయస్కరమని తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తే తలకు టోపీ, తలపాగా పెట్టుకోవాలని, శరీరాన్ని ఎండ నుంచి రక్షించుకోవాలని సూచించారు. ఈ జాగ్రత్తలు పాటించకపోతే వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉందనిపేర్కొన్నారు.
చలివేంద్రాలు ఏర్పాటు..
ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పంచాయత్ రాజ్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు, మండల కేంద్రాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని పంచాయతీ రాజ్ కమిషనర్ ద్వారా జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ చలివేంద్రాలు తక్షణమే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఇక ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కార్మికులకు మంత్రి సీతక్క ప్రత్యేకంగా సూచనలు చేశారు. వేసవికాలంలోనే ఎక్కువగా పనులు జరుగుతున్న నేపథ్యంలో కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎండలో పని చేయాల్సి వస్తే తలకు తలపాగా ధరించడం, శరీరాన్ని కాపాడుకోవడం, సమీపంలో తాగునీరు ఉంచుకోవడం తప్పనిసరి అని చెప్పారు. పనిస్థలాల్లో మంచినీటి సదుపాయం కల్పించాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఉపాధి హామీ పనుల్లో హాజరు నమోదు కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫేషియల్ రికగ్నిషన్ విధానం వల్ల కార్మికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అయినప్పటికీ ఆ నిబంధనలను అమలు చేయాల్సిన పరిస్థితి ఉందని, ఉపాధీ కూలీలు దీన్ని గమనించాలని కోరారు. మీ ఆరోగ్యం మీకే కాదు, ప్రభుత్వానికి కూడా ముఖ్యమే. కాబట్టి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో పనులు చేయకుండా, అవసరమైతే తగిన జాగ్రత్తలతో మాత్రమే పని చేయాలని మంత్రి సీతక్క సూచించారు.






