అంగన్‌వాడీల్లో ప్రీ-ప్రైమరీపై ప్రభుత్వం నజర్.. మంత్రి సీతక్క ఆదేశాలతో కీలక నిర్ణయం

by Ramesh Naini |

అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య (Pre-primary education)ను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.

అంగన్‌వాడీల్లో ప్రీ-ప్రైమరీపై ప్రభుత్వం నజర్.. మంత్రి సీతక్క ఆదేశాలతో కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని (Anganwadi centers) అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య (Pre-primary education)ను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) ఆదేశాల‌తో అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగారు. ప్రస్తుతం అనేక అంగన్‌వాడీ కేంద్రాలు ఒకే గదిలో నడుస్తున్నందున ప్రీ-ప్రైమరీ తరగతులు నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా, (Zero Enrollment) జీరో ఎన్రోల్మెంట్ ఉన్న ప్రభుత్వ పాఠశాల భవనాలను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో 21 జిల్లాల్లో 61 ప్రభుత్వ పాఠశాలలను గుర్తించారు. అందులో 34 పాఠశాలలు అంగన్‌వాడీ కేంద్రాలకు సమీపంలో ఉన్నందున‌ అక్కడికి అంగన్‌వాడీ కేంద్రాలను మార్చి, పూర్వ ప్రాథమిక విద్యా తరగతులను ప్రారంభించాలని తాజాగా మంత్రి సీతక్క ఆదేశించారు. అనుగుణంగా మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ జీ. సృజన జిల్లా అధికారులకు మార్గ‌దర్శ‌కాలు జారీ చేశారు. పాఠశాలల ప్రస్తుత పరిస్థితులను తక్షణమే పరిశీలించి, అనువుగా ఉంటే జిల్లా విద్యా అధికారులతో (డీఈఓ) సమన్వయం చేసి భవనాలను అంగన్‌వాడీ కేంద్రాల కోసం కేటాయించాలని ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 1 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేసి పూర్వ ప్రాథ‌మిక విద్యా బోధ‌న‌ను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

దేశానికి ఆదర్శంగా తెలంగాణ అంగన్‌వాడీలు- సీత‌క్క‌

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా (Anganwadi) అంగన్‌వాడీ కేంద్రాల్లోనే పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తున్నామని తెలిపారు. ప్రైవేటు ప్లే స్కూల్లకు ఏమాత్రం తీసిపోకుండా అంగన్‌వాడీలు ఇప్పటికే పిల్లలకు నాణ్యమైన విద్య, సంరక్షణ అందిస్తున్నాయని గుర్తుచేశారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి, అంగన్‌వాడీల్లో ప్రీ-ప్రైమరీ సామర్థ్యాన్ని పెంపొందించి పిల్లలను ప్రాథమిక విద్యకు సిద్ధం చేస్తున్నాని తెలిపారు. చిన్నారి జీవితంలో ప్రారంభ దశలో ఇచ్చే సరైన సంరక్షణ, విద్య వారికి జీవితాంతం సానుకూల ఫలితాలు ఇస్తాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయని వెల్లడించారు. అందుకే పూర్వ ప్రాథమిక విద్యను అంగన్‌వాడీల ద్వారా అందిస్తూ వారి బంగారు భ‌విష్య‌త్తుకు బాటలు వేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. అంతేకాక, జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలను వినియోగించడం ద్వారా ఈ పథకాన్ని మరింత విస్తృతం చేసి, రాష్ట్రంలోని ప్రతి చిన్నారికి నాణ్యమైన ప్రారంభ విద్య అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు.

Next Story