- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
14 వేల అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామకాలపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు
త్వరలో 14 వేల అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామకం చేపట్టబోతున్నామని మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాజేంద్రనగర్‌లోని టీజీఐఆర్డీ ప్రాంగణంలో శుక్రవారం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన 181 మంది గ్రేడ్ వన్ సూపర్వైజర్లకు నియామక పత్రాలను మంత్రి సీతక్క స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా (Minister Seethakka) సీతక్క మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమ శాఖకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. అంగన్వాడీ వ్యవస్థ మహిళా శక్తికి ప్రతీకగా నిలుస్తోందని ఆమె అన్నారు. ఐసీడీఎస్ సేవలకు ఈ దేశంలో ఇందిరా గాంధీ ప్రాణం పోశారని, మహిళలకు గౌరవం, చిన్నారులకు సంరక్షణ కలగాలని ఆమె ప్రారంభించిన అంగన్వాడీ సేవలు తెలంగాణ నేల నుంచే బీజం వేశాయన్నారు. 1970లో మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ సేవలు దేశవ్యాప్తంగా విస్తరించాయని గుర్తుకు చేశారు. (Anganwadi) అంగన్వాడీ హెల్పర్ నుంచి మహిళా శాఖ సెక్రటరీ వరకు ఈ రోజు ఉన్న పదవులన్నీ ఇందిరా గాంధీ చలువే అని, ప్రతి మహిళ ఆమెకు రుణపడి ఉండాలని సీతక్క తెలిపారు.
కొత్తగా నియమితులైన సూపర్వైజర్లకు సీతక్క మార్గదర్శనం చేశారు. వృత్తి ధర్మం ప్రజల ఆశలు, అవసరాలకు తగినట్లుగా ఉండాలని సూచించారు. ఒక్కో సూపర్వైజర్ కింద 25 అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యత ఉంటుందని, ఎక్కడా చిన్న లోపం లేకుండా ఆ కేంద్రాలను పర్యవేక్షించాలని, పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉందని సూచనలు ఇచ్చారు. అంగన్వాడీ కేంద్రాలను పౌష్టికాహారానికి మాత్రమే పరిమితం చేయకుండా చిన్నారులకు ప్రాథమిక విద్యను అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. అమ్మ ఆప్యాయతకు నిలయాలుగా అంగన్వాడీ కేంద్రాలు మారుతున్నాయన్నారు. చిన్నారుల కోసం 57 రకాల ఆట వస్తువులు, యూనిఫాంలు అందిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. మన దేశ భవిష్యత్తు అంగన్వాడీ కేంద్రాల్లోనే ఉంది.. కాబట్టి ప్రతి సూపర్వైజర్ తన వృత్తి ధర్మాన్ని నిబద్ధతతో పాటించాలని ఆమె సూచించారు.
తెలంగాణలో పోషకాహార లోపాన్ని నిర్మూలించడంలో సూపర్వైజర్లు కీలక పాత్ర పోషించాలంటూ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. త్వరలో 14 వేల అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామకం చేపట్టబోతున్నామని మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారు.






