- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఆ గాయం జీవితాంతం వెంటాడుతుంది’.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్‌లోని హోటల్ పార్క్ ప్రాంగణంలో సీఐఐ, యంగ్ ఇండియన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాసూమ్ సమ్మిట్ 10వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని హోటల్ పార్క్ ప్రాంగణంలో సీఐఐ, యంగ్ ఇండియన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాసూమ్ సమ్మిట్ 10వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) ముఖ్య అతిథిగా హాజరై, చిన్నారుల భద్రత(Child Safety), మహిళల రక్షణ, పోషకాహారం, మహిళా సాధికారత వంటి కీలక అంశాలపై ప్రసంగించారు. చిన్నారుల రక్షణను తమ ప్రజా ప్రభుత్వం ప్రధాన బాధ్యతగా భావిస్తోందని స్పష్టం చేశారు. "పిల్లలు అంటే మన భవిష్యత్తు. వారి రక్షణ అంటే మన భవిష్యత్తు రక్షణ. పసి హృదయాల్లో నాటుకుపోయే భావనలే వారి జీవితాన్ని నిర్దేశిస్తాయి. చిన్నారి గాయపడితే ఆ గాయం జీవితాంతం వెంటాడుతుంది. అందుకే పిల్లలు నిర్భయంగా, స్వేచ్ఛగా, ధైర్యంగా జీవించే వాతావరణాన్ని కల్పించడం సమాజం మొత్తం బాధ్యత” అని ఆమె అన్నారు.
మహిళా భద్రతపై మాట్లాడుతూ, ఈ నెల 22న మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, ఉన్నతాధికారులు పాల్గొనే మహిళా సదస్సు నిర్వహిస్తున్నామని, వారి అభిప్రాయాల ఆధారంగా కొత్త మహిళా భద్రతా పాలసీ తీసుకురాబోతున్నామని ప్రకటించారు. చిన్నారుల పోషకాహారంపై దృష్టి సారిస్తూ, ఈ నెల 17 నుంచి అక్టోబర్ 16 వరకు రాష్ట్రవ్యాప్తంగా పోషణ మాసం నిర్వహించనున్నట్లు తెలిపారు. “పిల్లల్లో పౌష్టికాహారం పెంపొందించేందుకు పరిశోధనలు జరిపి అంగన్వాడి మెనూలో మార్పులు చేశాము. పౌష్టికాహారం ప్రాధాన్యతపై నెలరోజుల పాటు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాము” అని వివరించారు.
లైంగిక నేరాల నియంత్రణలో కేవలం శిక్షలకే పరిమితం కాకుండా శిక్షణా కార్యక్రమాలు కూడా ఉండాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. “ఆడవారిని గౌరవించాలని తరగతి గదిలోనే నేర్పాలి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి అంశాలపై ఇళ్లలో, పాఠశాలల్లో, గ్రామాల్లో తప్పనిసరిగా చర్చ జరగాలి. తప్పు జరిగితే పిల్లలు ధైర్యంగా మాట్లాడే వాతావరణాన్ని కల్పించాలి” అని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ప్రాముఖ్యతను గుర్తుచేసిన ఆమె, 1975లో ఇందిరాగాంధీ ప్రారంభించిన ఈ వ్యవస్థ, ఇప్పుడు పోషకాహారంతో పాటు ఆరోగ్యం, ఆనందం, ప్రాథమిక విద్య అందిస్తున్నదని వివరించారు. చిన్నారుల అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు. అలాగే డ్రగ్స్ నియంత్రణకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో పోలీస్ శాఖలో ప్రత్యేక నార్కోటిక్స్ విభాగాన్ని ఏర్పాటు చేసి, నిఘాను పెంచినట్లు చెప్పారు.
మహిళా సాధికారత(Women Empowerment)పై మాట్లాడుతూ, “మహిళా సంఘాలను బలోపేతం చేసి వారిని సామాజిక, ఆర్థికంగా బలపరచడం ద్వారా చిన్నారుల రక్షణను సుస్థిరం చేస్తున్నాం. అంబేద్కర్ చెప్పినట్లుగా మహిళా ప్రగతితోనే సమాజం అభివృద్ధి చెందుతుంది” అన్నారు. ప్రభుత్వ చర్యల గురించి మాట్లాడుతూ, హెల్ప్‌లైన్‌లు, కౌన్సెలింగ్, ప్రత్యేక బృందాల ద్వారా బాధిత చిన్నారులకు అండగా నిలుస్తున్నామని, పాఠశాలల్లో అమ్మాయిలకు స్వీయ రక్షణ శిక్షణ ఇవ్వడం జరుగుతోందని వివరించారు. మాసూమ్ కార్యక్రమంపై అభినందనలు తెలిపిన మంత్రి, “మీరు పది సంవత్సరాలుగా పిల్లల భద్రత కోసం చేస్తున్న కృషి ప్రశంసనీయం. సమాజంలో ఉండే మౌనాన్ని తొలగించి అమ్మాయిల భద్రతను చర్చించే వేదికను సృష్టించారు. మా ప్రజా ప్రభుత్వం మీతో కలిసి పనిచేసి ప్రతి చిన్నారి భయపడకుండా స్వేచ్ఛగా కలలు కనగల వాతావరణాన్ని నిర్మిస్తుంది” అని హామీ ఇచ్చారు.






