- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉపాధి హామీని చంపే కుట్ర.. పథకం పేరు మార్పుపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు
పేదల పొట్ట కొట్టడమే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశమని మంత్రి సీతక్క విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: పేదల పొట్ట కొట్టడమే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశమని మంత్రి సీతక్క విమర్శించారు. అందుకే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరునే కాకుండా, దాని ఆత్మను, అమలు విధానాన్ని మార్చేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును ‘వికసిత్ భారత్-గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ్)గా మార్చే బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆ బిల్లును మంత్రి సీతక్క తీవ్రంగా తప్పుబట్టారు. గ్రామీణ పేదలకు ఉపాధి భరోసా కల్పించాలనే మహాత్మాగాంధీ ఆలోచనలకు విరుద్ధంగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర విధానం పేదలను, రాష్ట్రాలను శిక్షించే విధంగా ఉందని పేర్కొన్నారు. గ్రామీణ పేదలకు జీవనోపాధి భద్రత కల్పించడం, వలసలను తగ్గించడం, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధిని సాధించడం వంటి గొప్ప లక్ష్యాలతో నాటి యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ చారిత్రక పథకాన్ని నిర్వీర్యం చేయాలనే దురుద్దేశంతోనే కేంద్రం ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఆరోపించారు.
గతంలో వంద శాతం నిధులు వెచ్చిస్తూ పథకాన్ని అమలు చేసిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు తన వాటాను 60 శాతానికి తగ్గించి, మిగిలిన 40 శాతం భారాన్ని రాష్ట్రాలపై మోపడం అన్యాయమని పేర్కొన్నారు. ఇది రాష్ట్రాల ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపే నిర్ణయమని, కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నమేనని విమర్శించారు. పథకం పేరులో నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం ద్వారా గాంధీజీ ఆలోచనలు, విలువలపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేక వైఖరి స్పష్టంగా కనిపిస్తున్నదని ఆరోపించారు. మొదటి నుంచే ఈ పథకం నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఇష్టం లేదని, అందుకే దశలవారీగా బలహీనపరిచే కుట్రలకు తెరలేపుతున్నదని పేర్కొన్నారు. చట్టం ప్రకారం ప్రతి గ్రామీణ పేద కుటుంబానికి వంద రోజుల ఉపాధి కల్పించాల్సి ఉన్నప్పటికీ, బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏ ఏడాదిలోనూ 42 రోజుల కన్నా ఎక్కువ పని దినాలు కల్పించలేదని ఆరోపించారు. ఇది చట్ట ఉల్లంఘనకు సమానమని తెలిపారు. గత ఏడాది రాష్ట్రంలో 12.5 కోట్ల పని దినాలు కల్పించగా, ఈ ఏడాది కేవలం 7.5 కోట్ల పని దినాలకే పరిమితం చేశారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పూర్తి నిధులతో, బాధ్యతాయుతంగా కేంద్ర ప్రభుత్వమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.






