- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: పంచాయతీ కార్యదర్శులకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్
పంచాయతీ కార్యదర్శులకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రజాభవన్‌లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka)తో తెలంగాణ పంచాయత్ సెక్రటరీస్ ఫెడరేషన్ ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు(Panchayat Secretaries) సమావేశమయ్యారు. దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ, తమకు రూ.104 కోట్ల బిల్లులు విడుదల చేయించడం, డిప్యూటేషన్‌లకు అనుమతి ఇవ్వడం వంటి నిర్ణయాలు తీసుకున్నందుకు మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఏ. శ్రీకాంత్ గౌడ్, రాష్ట్ర కోశాధికారి ఎం. శశిధర్, రాష్ట్ర నాయకులు ఎం. హరికృష్ణ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పి. శివకుమార్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సాపాటి పాండు తదితరులు మంత్రి సీతక్కను కలసి పలు సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ కాలం గణన, ప్రొబేషన్ డిక్లరేషన్, ఔట్సోర్సింగ్ విధానం రద్దు చేసి OPS లను జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా క్రమబద్ధీకరణ, స్పోర్ట్స్ కోటా కింద ఎంపికైన 98 మంది అభ్యర్థులను విధుల్లోకి తీసుకోవడం, బీఆర్ఎస్ హయంలో 16 రోజుల సమ్మె కాలాన్ని సర్వీస్ కాలంగా పరిగణించడం, మెడికల్ బిల్లుల క్లియరెన్స్, స్పౌస్, మ్యూచువల్ ట్రాన్స్ఫర్లకు అనుమతి, ఎక్స్ సర్వీస్ మెన్ పే ఫిక్సేషన్ వంటి అంశాలను వివరించారు. పంచాయతీ కార్యదర్శుల వినతి పట్ల సానుకూలంగా స్పందించిన మంత్రి సీతక్క.. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజనకు సంబంధిత అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శాఖ స్థాయిలో పరిష్కరించదగిన సమస్యలపై వెంటనే ఫైలు సిద్ధం చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు.
పంచాయతీ కార్యదర్శుల సమస్యలన్నింటికీ న్యాయమైన పరిష్కారం చూపించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందనీ, త్వరలోనే పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి అన్ని అంశాలపై నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన మంత్రి సీతక్కకు పంచాయతీ కార్యదర్శులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శాలువాతో మంత్రిని సత్కరించారు.






