రొమ్ము క్యాన్సర్ సమాజాన్ని పట్టిపీడిస్తోంది.. డాక్టర్లకు మంత్రి సీతక్క కీలక సూచనలు

by Ramesh Naini |

రొమ్ము క్యాన్సర్ సమాజాన్ని పట్టిపీడిస్తోంది. కానీ దాన్ని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే నివారించడం చాలా సులభమని మంత్రి సీతక్క అన్నారు.

రొమ్ము క్యాన్సర్ సమాజాన్ని పట్టిపీడిస్తోంది.. డాక్టర్లకు మంత్రి సీతక్క కీలక సూచనలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రొమ్ము క్యాన్సర్ (breast cancer) సమాజాన్ని పట్టిపీడిస్తోంది. కానీ దాన్ని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే నివారించడం చాలా సులభమని మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ యశోద ఆసుపత్రి(Yashoda Hospital)లో బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభతో పాటు పెద్ద సంఖ్యలో వైద్యులు, వైద్య సిబ్బంది, సామాన్య ప్రజలు పాల్గొన్నారు. సదస్సులో మంత్రి శ్రీమతి సీతక్క మాట్లాడుతూ.. రొమ్ము క్యాన్సర్‌పై ప్రస్తుతం అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. క్యాన్సర్ రాగానే జీవితం ముగిసిందనే భయాలు అవసరం లేదని, క్యాన్సర్ పేషెంట్లకు (doctors) వైద్యులు విశ్వాసం కల్పిస్తే, దానిని జయించడం సాధ్యమవుతుందని కీలక సూచనలు చేశారు.

క్యాన్సర్‌పై ప్రజలకు మరింత అవగాహన కల్పించడం అత్యవసరమని అభిప్రాయపడ్డారు. వైద్యులు ఇలాంటి కార్యక్రమాల్లో ముందుండాలని, యశోద ఆసుపత్రి ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమైన విషయమన్నారు. కేవలం పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన క్యాంపులు నిర్వహించాలని, అప్పుడే వైద్య వృత్తి సార్థకమవుతుందని మంత్రి సూచించారు. తెలంగాణ ప్రభుత్వం మహిళా, శిశు సంక్షేమ శాఖ, ఆరోగ్యశాఖల ద్వారా గ్రామాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తోందని,, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయించడం ద్వారా మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ అవగాహన కార్యక్రమాలకు వైద్యులు తోడ్పాటు అందించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వర్ధమాన నటి డా. శ్రీలీల, యశోద హాస్పిటల్ డైరెక్టర్ ఫాల్గుణ గోరుకంటి, మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డా. లింగయ్య, అంకాలజీ విభాగం అధిపతి డా. రాజేశ్, ఇతర వైద్య ప్రముఖులు పాల్గొన్నారు.

Next Story