Minister Seethakka : బండి సంజయ్ వ్యాఖ్యలపై ఫైర్ అయిన మంత్రి సీతక్క

by Muthe.Rajitha |   (  Updated:2024-12-08 12:50:30  IST  )

రాష్ట్ర క్యాబినెట్లో మాజీ మావోయిస్టులున్నారని కేంద్ర మంత్రి బండి సంజ‌య్(Bandi Sanjay) చేసిన వ్యాఖ్యల‌పై మంత్రి సీతక్క(Minister Seethakka) ఫైర్ అయ్యారు.

Minister Seethakka : బండి సంజయ్ వ్యాఖ్యలపై ఫైర్ అయిన మంత్రి సీతక్క
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర క్యాబినెట్లో మాజీ మావోయిస్టులున్నారని కేంద్ర మంత్రి బండి సంజ‌య్(Bandi Sanjay) చేసిన వ్యాఖ్యల‌పై మంత్రి సీతక్క(Minister Seethakka) ఫైర్ అయ్యారు. అట్టడుగు స్థాయి నుంచి ఎదిగొచ్చిన ఆదివాసి బిడ్డను అవ‌మాన ప‌రిచే కుట్ర జ‌రుగుతుంద‌ని సీతక్క భావోద్వేగానికి గురయ్యారు. క్యాబినెట్లో నక్సలైట్ బ్యాగ్రౌండ్ నుంచి వ‌చ్చింది తానొక్కరే అని, అంత మాత్రానా మొత్తం క్యాబినెట్ కు న‌క్సలైట్ ముద్ర ఆపాదించ‌డం దేనికని మండి పడ్డారు. 2004 లో మొద‌టిసారి తాను ఎమ్మెల్యేగా పోటిచేసిన‌ప్పుడు బీజేపీ నాకు మ‌ద్దతిచ్చి ప్రచారం చేసిందని, అప్పుడు నా బ్యాక్ గ్రౌండ్ బీజేపీ నేత‌ల‌కు తెలియ‌దా? అని ప్రశ్నించారు. జ‌న‌జీవ‌న స్రవంతిలో కలిసాకా..న‌ల్లకోటు వేసుకుని లాయర్ గా ప్రజల ప‌క్షనా ఎన్నో కేసులు వాదించానని, భారత రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కుల‌తోనే మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యానని తెలియజేశారు.

ప్రధాని, హోంమంత్రి న‌క్సలైట్లను జ‌న‌జీవ‌న స్రవంతిలో క‌ల‌వాల‌ని కోరుతారని, బండి సంజ‌య్ మాత్రం జ‌న‌జీవ‌న స్రవంతిలో కలిసిన వారిని అవ‌మాన ప‌రిచేలా మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ ఏ భావ‌జాల‌మో బండి సంజ‌య్ కు తెలియ‌దా అని నిలదీశారు. పేద‌ల ఐఎఎస్ గా గుర్తింపు పొందిన ఆకునూరు మురళిని అర్బన్ న‌క్సలైట్ అనడం ఏం సంస్కారమని మండిపడ్డారు. క‌రీంనగర్లో దొరల దౌర్జన్యాలను,దాష్టికాల‌ను ఓడించిది ఏ భావ‌జాల‌మో మీ తల్లిదండ్రులని అడగాలని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగాన్ని నమ్ముకుని రాజ్యాంగానికి లోబడి పని చేస్తున్నామని, తన ఎదుగుద‌ల‌, ప్రజాద‌ర‌ణ‌ను చూసి ఓర్చు కోలేక లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తున్నారని, ప్రజాభిమానాన్ని తట్టుకోలేక మానసికంగా ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని సీతక్క భావోద్యేగానికి గురయ్యారు. దొడ్డి దారిన పదవులు దక్కించుకోలేదని.. ప్రజల మధ్య ఉండి కష్టపడి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిస్తేనే మంత్రి పదవి వచ్చిందని తెలిపారు. బండి సంజయ్ ఎన్నోసార్లు న‌న్ను వీరవనిత అన్న సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. మమ్మల్ని తొక్కి పడేయాలని చూస్తే స‌హించేది లేదని.. మతాలు, కులాలు పేరు తో విద్వేశ రాజ‌కీయాలు చేయ‌డం రాదన్నారు. బండి సంజ‌య్ త‌న వ్యాఖ్యల‌ను త‌క్షణం వెన‌క్కు తీసుకోవాలని సీతక్క డిమాండ్ చేశారు.

Next Story