పనితీరు మార్చుకోండి.. ఎంపీఓలు, డీఎల్పీఓలకు మంత్రి సీతక్క వార్నింగ్

by Ramesh Naini |

గ్రామీణ తెలంగాణను స్వచ్ఛత, పచ్చదనానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సూచించారు.

పనితీరు మార్చుకోండి.. ఎంపీఓలు, డీఎల్పీఓలకు మంత్రి సీతక్క వార్నింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామీణ తెలంగాణను స్వచ్ఛత, పచ్చదనానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సూచించారు. సోమవారం సచివాలయం నుంచి జిల్లా పంచాయతీ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి సీతక్క పారిశుధ్య నిర్వహణ, నిధుల వినియోగం, వన మహోత్సవం, తాగునీటి భద్రత తదితర అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ పాల్గొన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని, దోమల వ్యాప్తిని అరికట్టేందుకు బ్లీచింగ్ పౌడర్ చల్లడం, నీటి నిల్వ ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేయడం, ప్రతిరోజూ సాయంత్రం ఫాగింగ్ నిర్వహించడం వంటి చర్యలను తప్పనిసరిగా చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ప్రతి వారంలో ఒకరోజు "డ్రై డే" నిర్వహించి ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూడాలని సూచించారు. మంచినీటి పైపుల లీకేజీలను వెంటనే నివారించాలని, ఓవర్ హెడ్ ట్యాంకుల క్లోరినేషన్‌ను క్రమం తప్పకుండా నిర్వహించాలని, తాగునీటి నాణ్యత పరీక్షలను నిరంతరం చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు.

అధికారుల తీరుపై అసంతృప్తి:

ఎంపీఓలు, డీఎల్పీఓల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫోటోలు క్యాప్చర్ చేయడం వరకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించేలా పనిచేయాలని హెచ్చరించారు. వారి పనితీరుపై సమగ్ర నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. విధులను సక్రమంగా నిర్వర్తించని వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. డీపీఓలు, డీఎల్పీఓలు, ఎంపీఓలు గ్రామాల్లో చేపట్టే పారిశుధ్య కార్యక్రమాలను పంచాయతీ సెక్రటరీ పనితీరు మాడ్యూల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. శాఖ కార్యదర్శి నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ప్రతి వారం గ్రామాలను సందర్శించి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించాలని ఆదేశించారు.

సీఈఓలు, డీపీఓలు, డీఆర్డీఓలు, సీఈలు, ఎస్‌ఈలు, ఈఈలతో ప్రత్యేక సమన్వయ సమావేశాలు నిర్వహించాలని మంత్రి సూచించారు. శాఖల మధ్య సమన్వయం పెరిగితేనే గ్రామాభివృద్ధి వేగవంతమవుతుందని పేర్కొన్నారు. లక్షకు పైగా సిబ్బందితో రాష్ట్రంలో అతి పెద్ద శాఖగా పంచాయతీరాజ్ వ్యవస్థ ఉందని, అందరూ సమిష్టిగా పని చేసి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలని మంత్రి సీతక్క అన్నారు. ఇన్నాళ్లు గ్రామ పంచాయతీలకు పాలక మండళ్లు లేకపోవడంతో ఉద్యోగులపై ఒత్తిడి తక్కువగా ఉండేదని, ఇప్పుడు పాలక మండళ్లు ఏర్పాటైన నేపథ్యంలో మరింత బాధ్యతతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. పనితీరులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని హెచ్చరించారు. పంచాయ‌తీ నిధుల నిర్వ‌హ‌ణ పార‌ద‌ర్శ‌కంగా జ‌ర‌గాలని..ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన ఖ‌ర్చుల‌కు సంబంధించి నివేదిక స‌మర్పించాల‌ని ఆదేశించారు. ఈ నెల 18 నుంచి ప్రారంభ‌మ‌య్యే వ‌న‌మ‌హోత్స‌వాన్ని విజ‌యవంతం చేయాల‌ని సూచించారు.

Next Story