కస్తూర్బా పాఠశాలలో ఘనంగా ఉప ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు

by Taduka Kalyani |

రాష్ట్రంలోని అన్ని వసతి గృహాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

కస్తూర్బా పాఠశాలలో ఘనంగా ఉప ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు
X

దిశ, మొయినాబాద్: రాష్ట్రంలోని అన్ని వసతి గృహాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తన జన్మదినం సందర్భంగా సోమవారం మొయినాబాద్ మండలం నజీబ్‌నగర్‌లోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంను సందర్శించిన ఆయన, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి విద్యార్థినులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలను పంపిణీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా 29 లక్షల మంది ప్రభుత్వ విద్యార్థులకు అల్పాహార పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. హాస్టళ్లలోని విద్యార్థులందరికీ పోషకాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అధికారంలోకి వచ్చిన తర్వాత 40 శాతం డైట్, 200 శాతం కాస్మోటిక్ చార్జీలను పెంచినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వ, సంక్షేమ వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన భోజనం, యూనిఫాంలు, షూస్ అందిస్తున్నామని భట్టి పేర్కొన్నారు. పేద విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వమే కస్తూర్బా గాంధీ పాఠశాలలను ఏర్పాటు చేసిందని గుర్తుచేస్తూ, వాటి వల్ల బాలికల డ్రాపవుట్లు గణనీయంగా తగ్గాయని చెప్పారు. నజీబ్‌నగర్ కేజీబీవీలో అదనపు గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపితే ముఖ్యమంత్రితో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే హాస్టల్‌లో వేడి నీటి కోసం సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని, విద్యార్థులకు రవాణా ఇబ్బందులు లేకుండా బస్సు సౌకర్యం కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సూచించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేసి, భోజన నాణ్యతపై ఆరా తీశారు.

హంగూ ఆర్భాటాలకు దూరంగా పేద బాలికల మధ్య

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ హంగూ ఆర్భాటాలకు దూరంగా పేద బాలికల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం భట్టి విక్రమార్క నిరాడంబరతకు నిదర్శనమని కొనియాడారు. గత ప్రభుత్వాల కాలంలో పెండింగ్‌లో ఉన్న డైట్, కాస్మోటిక్ బిల్లులను ప్రస్తుత ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ద్వారా విడుదల చేసిందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చల్లా నరసింహ రెడ్డి, చేవెళ్ల నియోజకవర్గ ఇన్‌చార్జులు పామేనా భీమ్ భరత్, కెఎల్ఆర్, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు జ్యోతి భీమ్ భరత్, రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరి సతీష్, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ , కార్పొరేషన్ చైర్మన్లు అన్వేష్ రెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యులు రుద్రరాజు, గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థినులు డైట్, కాస్మోటిక్ చార్జీల పెంపు, పాఠశాల ప్రారంభం రోజునే పుస్తకాలు అందించడంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపగా, స్థానిక కాంగ్రెస్ నేత భీమ్ భరత్ డిప్యూటీ సీఎం చేత కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య అధ్యక్షత వహించగా ప్రభుత్వ విప్ పట్నం మహేందర్రెడ్డి, షాద్నగర్ ఎమ్మెల్యే పీర్లపల్లి శంకర్, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షుడు చల్ల నరసింహారెడ్డి, అన్వేష్ రెడ్డి, కోట్నాక్ తిరుపతి, సిడబ్ల్యుసి సభ్యులు రుద్రరాజు, గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, మండల అధ్యక్షుడు మాణయ్య, కాశీమ్ బౌళి సర్పంచ్ రాజేందర్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్ జయశ్రీ, విద్యార్థులు, స్థానిక సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story