Seethakka: ఫ్రీ లోన్‌లతో మహిళలకు వ్యాపారాలు పెట్టిస్తాం.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పలువురు స్థానిక నేతలను మంత్రి సీతక్క పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

Seethakka: ఫ్రీ లోన్‌లతో మహిళలకు వ్యాపారాలు పెట్టిస్తాం.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలం మరింతగా పెరుగుతోంది. తాజాగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పలువురు స్థానిక నేతలను మంత్రి సీతక్క పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీతక్క ముఖ్య వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రజల పక్షం అని ఇతర పార్టీలు మతాలు, కులాలు, ప్రాంతాల పేరుతో రాజకీయాలు చేస్తుంటే, కాంగ్రెస్ అజెండా మాత్రం అభివృద్ధి మాత్రమే అని సీతక్క స్పష్టం చేశారు. మూడు సార్లు బీఆర్ఎస్‌కి గెలుపు ఇచ్చినా ప్రాంతంలో అభివృద్ధి జరగలేదని ఆమె విమర్శించారు. ఇప్పుడు స్థానికుడు, పక్కా లోకల్ నాయకుడు నవీన్ యాదవ్‌కి ఒక్క అవకాశం ఇవ్వాలని, ప్రజల సమస్యలు పరిష్కరించే సత్తా ఆయనకుందని మంత్రి పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు వేగంగా అమలవుతున్నాయని సీతక్క తెలిపారు. గత ప్రభుత్వంలో కనీసం రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని, కానీ మేము రేషన్ కార్డులు ఇస్తున్నామన్నారు. సన్నబియ్యం అందిస్తున్నామని, ప్రతి మహిళ మహిళా సంఘంలో చేరాలన్నారు. ఫ్రీ లోన్ ఇచ్చి మీ చేత వ్యాపారాలు పెట్టిస్తామని, ఆర్టీసీలో అద్దె బస్సులను మహిళా సంఘాలకు అప్పగించామని ఆమె వివరించారు. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించినది కాంగ్రెస్ పార్టీ అని గుర్తుచేస్తూ.. ఈ రిజర్వేషన్ల వల్లే ఎంతోమంది మైనార్టీ విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారు, ఉద్యోగాలు పొందారు.. అని చెప్పారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కూడా మైనార్టీలకు కోటా కల్పిస్తున్నామని, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4 వేల ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నామని మంత్రి వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి వర్గం అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ప్రజల అండతో నవీన్ యాదవ్‌ను గెలిపించాలని, జూబ్లీహిల్స్ అభివృద్ధికి దోహదపడాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.

Next Story