జీవోను నేను కూడా వ్యతిరేకించాను.. మావోయిస్టుల లేఖ‌పై మంత్రి సీత‌క్క‌ రియాక్షన్

by Ramesh Naini |

ఆదివాసీల విషయంలో మంత్రి సీతక్క స్పందించడం లేదని, జీవో నెంబర్ 49 రద్దు చేయాలని మావోయిస్టుల పేరిట మంత్రి సీతక్కకు హెచ్చరిక లేఖ విడుదల అయింది.

జీవోను నేను కూడా వ్యతిరేకించాను.. మావోయిస్టుల లేఖ‌పై మంత్రి సీత‌క్క‌ రియాక్షన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆదివాసీల విషయంలో మంత్రి సీతక్క స్పందించడం లేదని, జీవో నెంబర్ 49 రద్దు చేయాలని మావోయిస్టుల (Maoist Party Letter) పేరిట మంత్రి సీతక్కకు హెచ్చరిక లేఖ విడుదల అయింది. ఈ మావోయిస్టుల లేఖ‌పై మంత్రి సీత‌క్క‌ (Minister Seethakka) స్పందించారు. ఈ మేరకు ఇవాళ ములుగు జిల్లా ఏటూరు నాగారంలో మీడియాతో సీత‌క్క‌ మాట్లాడుతూ.. అ లేఖ మావోయిస్టు పార్టీ ఇచ్చిందా? లేదా? అన్న దానిపై స్పష్టత లేదని చెప్పారు. అయితే లేఖ‌లో లేని అంశాల‌పై ఒక రాజ‌కీయ‌ పార్టీ ప‌త్రిక‌లు, మీడియా సంస్థ‌లు సొంత వ్యాఖ్యానాలు చేస్తున్నాయని మండిపడ్డారు. మ‌హిళ‌పై అస‌భ్య ప‌ద‌జాలాన్ని వినియోగించ‌డం ఆవేద‌న క‌లిగిస్తోందని, ఒక మ‌హిళ‌ను ప‌ట్టుకుని సిగ్గులేదా అని రాయ‌డం ఏం జ‌ర్న‌లిజం అని ఫైర్ అయ్యారు.

నన్ను ఎన్నికల్లో ఓడించాలని ఎన్నో శక్తులు పని చేశాయని, అవే శ‌క్తులు ఇప్పుడు న‌న్ను టార్గెట్ చేస్తున్నాయని అన్నారు. ఒక కోయ మ‌హిళ‌ల‌కు జ‌న‌ర‌ల్ పోర్ట్ ఫోలియో ద‌క్క‌డాన్ని బీఆర్ఎస్ జీర్ణించుకోలేక‌పోతోందని ఆరోపించారు. 75 ఏళ్లలో మొట్టమొదటిసారిగా ఒక కోయ మహిళకు జనరల్ పదవి వస్తే స‌హించ‌లేక‌పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా వ్యక్తి గ‌త ప్ర‌తిష్ట‌ను దెబ్బతీసేలా తప్పుడు వీడియోలు సృష్టిస్తున్నారని అన్నారు. జీవో 49ను నేను వ్యతిరేకించాను అని గుర్తు చేశారు. గిరిజ‌న సంక్షేమ మంత్రి ఉండి.. పార్టీల‌కు అతీతంగా ఎస్టీ ఎమ్మెల్యేలంద‌రితో స‌మావేశ‌మై జీవో 49 ను ర‌ద్దు చేయాల‌ని తీర్మాణించినట్లు వివరించారు. ఏ హోదాలో, ఏ స్థాయిలో ఉన్నా నేను ఆదివాసి అడ‌వి బిడ్డ‌నే.. వారి సంక్షేమం, అభివృద్ది కోస‌మే నా జీవితం అంకితం.. అని తెలిపారు.

ఆదివాసులకు మేలు చేసేలా అధికారాన్ని వినియోగిస్తున్నానని తెలిపారు. అడ‌వి బిడ్డ‌ల ప‌ట్ల‌ అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్న అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటున్నామని అన్నారు. ములుగు, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం ఘ‌ట‌న‌లు మా దృష్టి రాగానే అటవీ శాఖ మంత్రి కొండా సురేఖతో, ప్రిన్స్ ప‌ల్ చీఫ్ కన్సర్వేట‌ర్ ఆఫ్ ఫారెస్ట్, పీసీసీఎఫ్ సువ‌ర్ణతో స్వ‌యంగా మాట్లాడినట్లు తెలిపారు. తన నియోజ‌క‌ర్గంలో కొంతమంది అటవీ అధికారులు ఆదివాసి గుడిసెల మీద దాడి చేశారని తెలిపారు. ఘటన తన దృష్టికి రాగానే అధికారుల‌కు ఫోన్ చేసి వెన‌క్కి పంపించినట్లు వెల్లడించారు. సొంత నిర్ణ‌యాల‌తో అధికారులు త‌ప్పు చేస్తే చ‌ర్య‌లు తీసుకుంటామని చెప్పారు. ఒకరిద్దరు అధికారులు తప్పా.. ఎవరూ ఆదివాలసీల జోలికి వెళ్లడం లేదన్నారు. అయితే ఎవరు మాట్లాడినా నిజాలు మాట్లాడాలంటూ మావోయిస్టులకు ఆమె పరోక్షంగా సూచించారు.

బీఆర్ఎస్ హయాంలో ఆదివాసుల‌పై దాడులు చేశారు.. ఇప్పుడు లేని ప్రేమ ఒల‌క బోస్తున్నారని విమర్శించారు. చంటి పిల్లల తల్లులను జైల్లో పెట్టారు.. చెట్లకు కట్టేసి కొట్టారు.. ఇప్పుడు మోస‌లి క‌న్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. ప‌దేళ్లు అధికారంలో ఉన్న‌ప్పుడు ఎందుకు పోడు స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించలేదని నిలదీశారు. మావోయిస్టుల లేఖను అడ్డం పెట్టుకొని నన్ను అవమానిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఫైర్ అయ్యారు. తనను ఓడించేందుకు వంద కోట్లు ఖర్చు చేశారు.. అయినా ములుగు ప్రజలు నాకు రికార్డు మెజార్టీ ఇచ్చారని తెలిపారు. ప్ర‌జ‌లిచ్చిన మంత్రి ప‌ద‌వితో ఏజెన్సీ ప్ర‌జ‌లు, పేద‌ల‌ను అభివృద్ధి ప‌రుస్తున్నామని తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో ఆదివాసీలు, బడుగు బలహీన వర్గాల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలుస్తోందన్నారు.

Next Story