సమ్మె విరమించండి– మంత్రి సీతక్క విజ్ఞప్తి

by velandi.Saikiran |

పేదలు, గ్రామీణ ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఆర్టీసీ మీద ఆధారపడుతున్నారని, వారికి ఇబ్బందులు కలగకుండా సీతక్క విజ్థప్తి చేశారు

సమ్మె విరమించండి– మంత్రి సీతక్క విజ్ఞప్తి
X

పేదలు, గ్రామీణ ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఆర్టీసీ మీద ఆధారపడుతున్నారు

- వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలి

- ప్రతి రోజు లక్షల మంది విద్య, వైద్యం, ఉపాధి కోసం ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం

-వారి జీవితాలు ఆగిపోకూడదు

- సమ్మె విరమించండి– మంత్రి సీతక్క విజ్ఞప్తి

దిశ, తెలంగాణ బ్యూరో: పేదలు, గ్రామీణ ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఆర్టీసీ మీద ఆధారపడుతున్నారని, వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి సీతక్క సమ్మెబాట పట్టిన ఆర్టీసీ కార్మికులకు విజ్థప్తి చేశారు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో అధికారిక పర్యటనలో ఉన్న మంత్రి సమ్మె విరమించి ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా ప్రజాస్వామ్య పద్దతిలో డిమాండ్ల పరిష్కారం కోసం పనిచేయాలని సూచించారు. ఆర్టీసీ మనందరి కుటుంబమని, కార్మికులు తన సోదరులని పేర్కొన్న ఆమె, ప్రజలకు ఇబ్బంది కలగకుండా తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరాలని కోరారు. సమ్మె అనేది సమస్యకు పరిష్కారం కాదని, చర్చల ద్వారానే సమస్యలను క్లియర్ చేసుకోవచ్చని మంత్రి స్పష్టం చేశారు. కార్మికుల సమస్యలపై ఇప్పటికే ఉన్నతాధికారుల కమిటీని నియమించామని, 4 వారాల్లో నివేదిక రానుందని తెలిపారు. ప్రభుత్వంలో విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికల వంటి అంశాలు పరిశీలనలో ఉన్నాయని, భవిష్యత్తులో లీగల్ ఇబ్బందులు రాకుండా ఉండేందుకే ఈ ప్రక్రియ జరుగుతోందని వివరించారు. కార్మిక సంఘాల మధ్య ఈ అంశాలపై ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు.

కార్మికుల పక్షపాతిగా ప్రభుత్వం

గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తూ.. "పదేళ్ల పాపం ఒక్క రోజుతో పోయేది కాదు" అని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో విలీనం కాకపోయినా, ప్రతి నెల మొదటి తారీఖున జీతాలు అందిస్తున్నామని గుర్తు చేశారు. గతంలో పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ, డీఏలు, బకాయిలను క్లియర్ చేసి మీకు బాసటగా నిలబడుతున్నామన్నారు. పీఎఫ్, సీసీఎస్ బకాయిలను గణనీయంగా తగ్గించామని తెలిపారు. ఉద్యోగ భారం తగ్గించేందుకు వేల సంఖ్యలో కొత్త నియామకాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రతిరోజూ లక్షలాది మంది విద్యార్థులు, రోగులు, ముఖ్యంగా మహిళలు ఆర్టీసీపై ఆధారపడి ఉన్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఉచిత ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు. కేసీఆర్ ఉచిత బస్సు దండగ అని హేళన చేసిన 24 గంటలకే సమ్మెకు వెళ్లడం వల్ల ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి. మీ సోదరిగా విజ్ఞప్తి చేస్తున్నాను.. ఆడబిడ్డలకు ఇబ్బంది కలిగించకండి అని సూచించారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో సమ్మె వల్ల సంస్థకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని మంత్రి హెచ్చరించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, హడావుడి నిర్ణయాలు తీసుకోకుండా ప్రభుత్వంతో చర్చలకు రావాలని ఆమె కార్మిక లోకానికి పిలుపునిచ్చారు.

Next Story