మేడిన్ తెలంగాణ.. మేడ్ బై ఉమెన్ : మంత్రి సీతక్క

by Naga Rani Yarlagadda |

మేడిన్ తెలంగాణ.. మేడ్ బై ఉమెన్ నినాదం మార్కెట్‌ను శాసించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.

మేడిన్ తెలంగాణ.. మేడ్ బై ఉమెన్ : మంత్రి సీతక్క
X
  • ఈ నినాదం మార్కెట్‌ను శాసించాలి
  • మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక ఇంక్యుబేటర్ కేంద్రాలు ప్రారంభం

దిశ, తెలంగాణ బ్యూరో : మేడిన్ తెలంగాణ.. మేడ్ బై ఉమెన్ నినాదం మార్కెట్‌ను శాసించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. మహిళల చేతుల్లో కేవలం బ్యాంక్ పాస్‌బుక్స్ మాత్రమే కాకుండా పరిశ్రమలు, వ్యాపారాలు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీత‌క్క పేర్కొన్నారు. గ్రామీణ మహిళల ప్రతిభకు, ఆలోచనలకు, వ్యాపార కలలను సాకారం చేసే వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక, సాంకేతిక, వ్యాపార పరమైన సహకారం అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఇంక్యుబేటర్ కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమం బంజారాహిల్స్‌లోని కొమరం భీం ఆదివాసీ భవన్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై ఇంక్యుబేటర్ కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా తెలంగాణ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటోందని వివరించారు.

బిట్స్ పిలానీ, టీ-హబ్ భాగస్వామ్యంతో 2 ప్రత్యేక ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి ఇంక్యుబేటర్‌కు రూ.10.70 కోట్ల నిధులు కేటాయించామని మంత్రి తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు ట్రైనింగ్‌, బ్రాండింగ్‌, మార్కెటింగ్‌, డిజిటల్ సపోర్ట్‌, ఫైనాన్షియల్ గైడెన్స్‌, బిజినెస్ మెంటారింగ్ వంటి సేవలు అందించనున్నట్లు చెప్పారు. 300 మంది మహిళా పారిశ్రామికవేత్తలను ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. మహిళలు ఉద్యోగాలు వెతికే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి రావాలి అని మంత్రి సీతక్క సూచించారు. మేడారం జాతర సందర్భంగా 554 మంది మహిళలకు రూ.6 కోట్ల సహాయం అందించగా, వారు కేవలం 15 రోజుల్లోనే రూ.9.5 కోట్ల వ్యాపారం నిర్వహించారని తెలిపారు. ఫుడ్ ట్రక్కులు, ఫిష్ మొబైల్ ట్రక్కులు వంటి సులభమైన వ్యాపార నమూనాలను మహిళలకు అందిస్తున్నామని వెల్లడించారు. గ్రామాల్లో మహిళలు తయారు చేసే ఉత్పత్తులు స్థానిక మార్కెట్‌కే పరిమితం కాకుండా అంతర్జాతీయ మార్కెట్లకు చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. చేర్యాల మహిళలు తయారు చేసిన చింతగింజల మాస్క్‌లు నెదర్లాండ్స్ వరకు ఎగుమతి కావడం తెలంగాణ మహిళల సృజనాత్మకతకు నిదర్శనమని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

Next Story