గ్రామ సభలపై అధికారుల‌కు మంత్రి సీత‌క్క దిశా నిర్దేశం

by Malleboina Mahesh |

ఈ గురువారం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సభలు! పండగలా నిర్వహించాలని మంత్రి సీతక్క ఆదేశం. ప్రజా సమస్యల పరిష్కారం, పథకాల అమలుపై సమగ్ర చర్చకు పిలుపు.

గ్రామ సభలపై అధికారుల‌కు మంత్రి సీత‌క్క దిశా నిర్దేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామ సభలను ప‌ల్లెల్లో పండ‌గ‌లా నిర్వ‌హించి విజయవంతం చేయాలని పంచాయతీ రాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారులతో మంత్రి సీతక్క మంగ‌ళ‌వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ దివ్యదేవరాజన్ తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యాచరణలో భాగంగా గురువారం గ్రామ సభలు నిర్వహించనున్న నేపథ్యంలో వాటి నిర్వహణపై మంత్రి సీత‌క్క అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. గ్రామ సభలు ప్రజల అభిప్రాయాలను నేరుగా తెలుసుకునే అత్యంత ముఖ్యమైన వేదికలని మంత్రి పేర్కొన్నారు. పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం, గ్రామస్థాయి సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారాలు కనుగొనడం, ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు.

అందరూ పాల్గొనేలా చూడాలి

గ్రామ సభల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాలు, రైతులు, యువత, స్వయం సహాయక సంఘాల సభ్యులు, లబ్ధిదారులు తప్పనిసరిగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రతి గ్రామంలో విస్తృత ప్రచారం చేపట్టి గ్రామస్థులందరూ హాజరయ్యేలా చూడాలని చెప్పారు. సభల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని, వేదిక, త్రాగునీరు, మహిళలు, వ్రుద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని మంత్రి ఆదేశించారు. సభల అజెండాను స్పష్టంగా ప్రజలకు తెలియజేసి, ప్రభుత్వ పథకాలపై సమగ్ర చర్చ జరిగేలా చూడాలని పేర్కొన్నారు.

రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి, గృహజ్యోతి, పింఛన్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, మహిళా శక్తి వంటి పథకాలపై గ్రామ సభల్లో విస్తృతంగా చర్చించాలన్నారు. ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించిన నూతన పథకాల కోసం అర్హులను గుర్తించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి గ్రామ సభలో విధిగా ఫిర్యాదు బాక్సులను ఏర్పాటు చేసి ప్రజల అభ్యంతరాలు, ఫిర్యాదులను స్వీకరించాలని మంత్రి సీతక్క అధికారులకు ఆదేశించారు. గ్రామ సభల అనంతరం సమావేశ వివరాలను నమోదు చేసి, సమస్యలు, తీర్మానాలు, తీసుకున్న నిర్ణయాలపై నివేదికలను సమర్పించాలని మంత్రి స్పష్టం చేశారు.

Next Story