మేఘాలయలో అంగన్వాడి సేవలను పరిశీలించిన మంత్రి సీతక్క

by velandi.Saikiran |   (  Updated:2026-04-22 16:28:01  IST  )

మేఘాలయలో అంగన్వాడి సేవలను పరిశీలించిన మంత్రి సీతక్క
X

మేఘాలయలో అంగన్వాడి సేవలను పరిశీలించిన మంత్రి సీతక్క

1000 డేస్ ప్రోగ్రామ్, యువత భాగస్వామ్యంపై ప్రశంసలు

దిశ, తెలంగాణ బ్యూరో: మేఘాలయలో అంగన్వాడి కేంద్రాలు కేవలం పోషకాహారం అందించే కేంద్రాలుగా కాకుండా, చిన్నారుల సమగ్ర అభివృద్ధికి కేంద్రాలుగా రూపుదిద్దుకున్నాయని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అభిప్రాయపడ్డారు. ఆటల ద్వారా నేర్పే విధానం, సృజనాత్మక వాతావరణం పిల్లల్లో నేర్చుకునే ఆసక్తిని పెంచుతున్నాయని తెలిపారు. మేఘాలయ రాష్ట్రంలో అధికారిక పర్యటనలో ఉన్న మంత్రితో పాటు శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా, జాయింట్ డైరెక్టర్ మోతి పాల్గొన్నారు. మేఘాలయలో అమలవుతున్న అంగన్వాడి సేవలు, వినూత్న కార్యక్రమాల అనుభవాలను అధ్యయనం చేసేందుకు ఈ పర్యటన చేపట్టారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క అక్కడి అంగన్వాడి కేంద్రాలను సందర్శించి, చిన్నారుల అభివృద్ధి కోసం అమలవుతున్న విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రత్యేకంగా మేఘాలయ ఎర్లీ చైల్డ్ హుడ్ డెవలప్మెంట్ మిషన్(ఈసీడీఎం) ద్వారా 0-6 సంవత్సరాల చిన్నారులపై సమగ్ర దృష్టి సారిస్తూ ఆరోగ్యం, పోషణ, విద్య అంశాలను సమన్వయం చేస్తూ అందిస్తున్న సేవలను మంత్రి ప్రశంసించారు.

1000 డేస్ ప్రోగ్రామ్:

ఈ వెయ్యిరోజుల ప్రోగ్రాం అమలు విధానం కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంది. గర్భధారణ నుంచి పిల్లవాడు రెండేళ్లు పూర్తయ్యే వరకు ఉండే తొలి 1000 రోజుల్లో తల్లి-శిశువుకు సమగ్ర సేవలు అందించడం ద్వారా పోషకాహార లోపాన్ని తగ్గిస్తూ, ఆరోగ్యవంతమైన అభివృద్ధిని సాధిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. మేఘాలయలో మరో ముఖ్యమైన ప్రత్యేకతగా యువత భాగస్వామ్యం నిలుస్తోంది. ఆసక్తి ఉన్న యువతకు మినిస్ట్రీ ఆఫ్ స్కిలింగ్ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇచ్చి, వారిని కమ్యూనిటీ వాలంటీర్లుగా తయారు చేస్తున్నారు. ఈ యువత తమ పరిధిలోని చిన్నారుల తల్లిదండ్రుల ఇళ్లకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి, ఎలా బోధించాలి, అభ్యసన పద్ధతులు ఎలా ఉండాలి అనే అంశాలపై సమగ్ర మార్గదర్శకత్వం అందిస్తున్నారు. మొదటి మూడు సంవత్సరాలు చిన్నారుల అభివృద్ధిలో అత్యంత కీలకమైన దశగా భావిస్తూ, ఈ దశలోనే దాదాపు 75 శాతానికి పైగా మెదడు నాడీ వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని గుర్తించి, తల్లిదండ్రులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ఈ విధానం వల్ల పిల్లల సమగ్ర ఎదుగుదలలో మేఘాలయ రాష్ట్రం మెరుగైన ఫలితాలు సాధించిందని మంత్రి సీతక్క అభినందించారు. అంగన్వాడి టీచర్లతో పాటు అదనంగా వాలంటీర్లు వ్యవస్థీకృతంగా పనిచేయడం, సమాజం మొత్తాన్ని ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేయడం మేఘాలయ మోడల్‌కు ప్రత్యేకతను తీసుకువచ్చిందని మంత్రి తెలిపారు.

తెలంగాణలో అమలు చేసేందుకు పర్యటన:

మేఘాలయ రాష్ట్రంలో చేపట్టిన విధానాలను ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో, మేఘాలయలోని ఈ అనుభవాలను తెలంగాణలో అన్వయించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మొత్తంగా మేఘాలయలో అమలవుతున్న అంగన్వాడి సేవలు సంప్రదాయం, ఆధునికత కలిసిన సమగ్ర అభివృద్ధి నమూనాగా నిలుస్తూ, దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి సీతక్క అభిప్రాయపడ్డారు.

Next Story