- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్థానిక సంస్థల పునరుజ్జీవానికి ప్రణాళికలు.. సంస్కరణలకు మంత్రి సీతక్క శ్రీకారం
పంచాయతీలను బలోపేతం చేస్తూనే.. మరోవైపు పల్లెల అభివృద్ధికి వినతూన పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: పంచాయతీలను బలోపేతం చేస్తూనే.. మరోవైపు పల్లెల అభివృద్ధికి వినతూన పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. మహాత్మాగాంధీ ఆలోచనలకు అనుగుణంగా.. గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేస్తున్నది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్న పంచాయతీ వ్యవస్థను గాడిలో పెడుతున్నది. దాదాపు 2 కోట్ల మంది ప్రజలతో అనుబంధం ఉన్న పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖకు రూ. 29,816 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. జీపీలకు పాత ప్రభుత్వ బకాయిలను రూ.750 కోట్ల వరకు చెల్లింపులు చేసింది. గ్రామాభివృద్ధే లక్ష్యంగా మంత్రి సీతక్క అధికారులు, సిబ్బందిని పరుగులు పెట్టిస్తున్నారు. వరుస సమీక్షలతో పాటు ప్రజల భాగస్వామ్యం పెంచే చర్యలు చేపట్టారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సంస్కరణలకు స్వాగతం పలికేలా పలు కీలక బిల్లుల రూపకల్పన జరుగుతున్నది.
పంచాయతీలను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్
గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థలను నామమాత్రంగా మార్చింది. నిధులు, విధులు, నిర్ణయాధికారం లేకుండా చేసి పంచాయతీలను నిర్వీర్యం చేసింది. గ్రామ జ్యోతి, మన ఊరు-మన ప్రణాళికల పేరుతో అధికారాలను వికేంద్రీకరణ చేశారు. పంచాయతీల సొంత నిధులు, కేంద్ర గ్రాంట్లను గ్రామాభివృద్ధి కోసం వెచ్చించకుండా సర్పంచులపై ఎన్నో రకాల ఆంక్షలను విధించారు. సర్పంచులకు సమాచారం లేకుండా, పాలకమండలికి తెలియకుండా పంచాయతీ ఖాతాల నుంచి నిధులను దారి మళ్లించారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఇవ్వాల్సిన నిధుల్లోనూ కోత పెట్టారు. బీఆర్ఎస్ హయాంలో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులను రూ.10,170 కోట్లు కేటాయించి.. అందులో రూ.4,181 కోట్లను దారి మళ్లించారు. అంటే 42 శాతం నిధులను సొంత అవసరాలకు దారి మళ్లించారు. కొత్తగా నాలుగువేల జీపీలను ఏర్పాటు చేసినా.. ఆర్థిక వనరులు సమకూర్చకపోవడంతో కొత్త పంచాయతీలు అభివృద్ధికి నోచుకోలేదు. ఏండ్ల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో పదుల సంఖ్యలో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు చోటు చేసుకున్నా.. పట్టించుకోలేదు.
ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేలా..
పంచాయతీల్లో ప్రజల భాగస్వామ్యం పెంచే చర్యలను ప్రజాప్రభుత్వం చేపడుతున్నది. పై నుంచి నిర్ణయాలను రుద్దకుండా.. ప్రజల ఆకాంక్షలు, అభిప్రాయాలను గౌరవిస్తూ పల్లెల బాగు కోసం చర్యలు చేపట్టింది. గ్రామాల్లో పరిశుభ్రత, పచ్చదనంతోపాటు ప్రజల జీవనోపాధి, జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు రెండు సార్లు చేపట్టిన స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం విజయవంతమైంది. 1.57 కోట్ల మంది ప్రజలను భాగస్వాములను చేశారు. పారిశుద్య నిర్వహణతోపాటు రోడ్లు, డ్రెయినేజీలు శుభ్రం చేశారు. 2.60 కోట్లకుపైగా మొక్కలను నివాస గృహాలకు పంపిణీ చేసి నాటించారు. 1.84 లక్షల మల్టీపర్పస్ కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. జీపీలకు భారం లేకుండా మల్టీపర్పస్ కార్మికుల వేతనాలను ప్రభుత్వమే నేరుగా చెల్లించాలని నిర్ణయించి, ఇప్పటి వరకు రూ.150 కోట్లను చెల్లించారు. ఉపాధి హమీ పథకం ద్వారా 40.1 లక్షల కూలీలకు 13.67 కోట్ల పనిదినాలు కల్పించి.. కూలీలకు రూ. 2,835.37 కోట్ల మేర కూలీని చెల్లించారు. రూ.846 కోట్ల ఖర్చుతో రాష్ట్ర వ్యాప్తంగా 26,231 చెరువుల్లో పూడిక తీత పనులు పూర్తి చేసి వాటి నిల్వ సామర్థ్యాన్ని పెంచారు. రూ.460 కోట్లు ఖర్చు చేసి ఫీడర్ చానల్స్ పూడికతీతకు సంబంధించి 52,097 పనులు చేయించారు. మొత్తం 13,063 ఎకరాల్లో పండ్ల మొక్కలు నాటడం ద్వారా.. 7,306 చిన్న, సన్నకారు రైతులకు లాభం జరిగింది. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కోసం రూ.20.99 కోట్లను 18,812 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఇవన్నీ ఏడాది కాలంలో జరిగిన మార్పులు.
జీపీలు, అంగన్ వాడీలకు భవనాలు
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చీ రాగానే పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాన్ని పటిష్టం చేసింది. ఇంజినీరింగ్, గ్రామీణ తాగు నీటి వ్యవస్థలో 499 ఏఈఈల నియామకాన్ని చేప్టటారు. కొత్తగా వేయి జీపీ భవనాలు, 960 అంగన్వాడీ భవనాల నిర్మాణ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. గ్రామీణ రహదారుల ఆధునీకరణ కోసం నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. వచ్చే నాలుగేళ్లలో 17 వేల కిలోమీటర్ల మేర పల్లె రోడ్ల ఆధునికీకరణ కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. గ్రామీణ రహదారుల కాంట్రాక్టర్లకు గత ప్రభుత్వం పెండింగులో ఉంచిన రూ.347.64 కోట్ల బిల్లులను వెంటనే చెల్లించారు. ఆదిమ జాతి, గిరిజన తెగలు నివాసముంటున్న 28 ఆవాసాలకు రూ. 65.85 కోట్లతో చేపట్టిన 66.98 కి.మీ రహదారుల నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. 2,800 కి.మీ కొత్త గ్రామీణ రహదారుల నిర్మాణం కోసం రూ.3,789.63 కోట్లతో పనులు కొనసాగుతున్నాయి. గ్రామీణ రహదారుల నిర్వహణ కోసం రూ.1,879.57 కోట్లు ఖర్చు చేస్తున్నారు. రూ. 298.92 కోట్లతో కొత్తగా మిషన్ భగీరథ పనులు చేపట్టారు. జనగామ, గజ్వేల్, మేడ్చల్, ఆలేరు, భువనగిరి సెగ్మెంట్ల పనులు పూర్తి చేయడానికి రూ.210 కోట్లతో పనులు కొనసాగుతున్నాయి. ఉట్నూర్ గిరిజన ప్రాంతాల్లోని 975 ఆవాసాలకు నిరంతరాయంగా తాగు నీరు అందించేందుకు ఆదిలాబాద్ జిల్లాకు రూ.60 కోట్లతో పనులు చేపడుతున్నారు. కర్ణాటకలోని నారాయణ పూర్ డ్యాం నుంచి జూరాల జలాశయానికి 2 టీఎంసీల నీటిని విడుదల చేయించి తాగు నీటి సమస్య లేకుండా చేశారు.
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ- సెర్ప్ బలోపేతం
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం పెద్దన్నలా అండగా నిలుస్తున్నది. ఇందిరా మహిళా శక్తి ద్వారా 17 రకాల వ్యాపారాలను గుర్తించి మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలను రచించింది. పొరుగు రాష్ట్రం ఏపీలో 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తిని అదానీ కంపెనీకి కట్టబెడితే.. తెలంగాణలో వెయ్యి మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ విద్యుత్ ప్లాంట్లను మహిళలు నడిపించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. సెర్ప్ ద్వారా 21,466 కోట్ల వడ్డీ లేని రుణాలను బ్యాంకుల ద్వారా ఇప్పించారు. మహిళలకు స్త్రీ నిధి ద్వారా రూ.2,022 కోట్ల లోన్లు ఇప్పించి వ్యాపారాలు చేసుకునేలా వారికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలిచింది.
మహిళా సంఘాలకు పెద్దపీట
రాష్ట్ర చరిత్రలో మొదటిసారి మహిళా సంఘాల లోన్ బీమా, ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ ఏడాది కాలంలో రూ.40 కోట్లు ఖర్చు చేశారు. మహిళలు ప్రమాదవశాత్తు మరణించినా, దురదృష్టవశాత్తు తీసుకున్న రుణాలు చెల్లించకపోయినా ఆ మహిళా సంఘానికి ఎలాంటి సమస్యలు లేకుండా ప్రభుత్వమే పెద్దన్నగా ఆ నష్టాన్ని భరిస్తున్నది. 150 ఆర్టీసీ అద్దె బస్సులను మొదటి విడతలో మహిళా సంఘాలకు అప్పగిస్తున్నారు. భవిష్యత్తులో మరో 450 బస్సులను మహిళా సంఘాలకు కేటాయించనున్నారు ఈ మేరకు ఆర్టీసీతో ఇప్పటికే ఒప్పందం ఖరారైంది. 22 జిల్లా మహిళా సమాఖ్యలకు ఇందిరా మహిళా శక్తి భవనాలు నిర్మిస్తున్నారు. ఒక్కో భవనానికి రూ.5 కోట్ల చొప్పున మొత్తం రూ.110 కోట్లు మంజూరు చేశారు. స్వయం సహాయక బృందాల మహిళా సభ్యులకు స్కూల్ యూనిఫాం కుట్టు పనుల ద్వారా యూనిఫాంల కుట్టు చార్జీలను జతకు రూ. 50 నుంచి రూ. 75కు పెంచారు.
స్కూల్ యూనిఫాం కుట్టు పనులతో మహిళా సంఘాలకు రూ. 80 కోట్ల లబ్ది చేకూరింది. శిల్పారామంలో రూ.9 కోట్లతో ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేసి స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు 106 దుకాణాలను కేటాయించారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్సులు, టూరిస్ట్ ప్లేస్ లో 36 మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఏడాది చివరి నాటికి మొత్తం 150 క్యాంటీన్ల నుప్రారంభించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 46.61 లక్షల మంది మహిళా సంఘ సభ్యులకు రెండు యూనిఫాం చీరలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిజైన్ల ఫైనలైజేషన్ చివరి దశలో ఉన్నది. సెలక్షన్ పూర్తయితే టెస్కో చీరలను పంపిణీ చేయనున్నారు. ఇలా గ్రామీణ ప్రాంతాల ఆర్థిక పటిష్టత పంచాయతీల స్వతంత్రను కాపాడే దిశగా మంత్రి సీతక్క ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. స్వయం సహాయ సంఘాల ద్వారా మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తూనే.. పంచాయతీల స్వంత్రతను కాపాడుతూ తొలి ఏడాదిలో పంచాయతీరాజ్ శాఖ తనదైన మార్పుతో ఇతర శాఖలకు ఆదర్శంగా నిలుస్తున్నది.






