TG: పాఠ్యాంశాలలో మార్పులు అవసరం: మంత్రి సీతక్క

by Gantepaka Srikanth |

మహిళల అభివృద్ధి, సాధికారత, సమాన అవకాశాలు, భద్రత అంశాలపై పలు కీలక శాఖలతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క ఉన్న‌తస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

TG: పాఠ్యాంశాలలో మార్పులు అవసరం: మంత్రి సీతక్క
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళల అభివృద్ధి, సాధికారత, సమాన అవకాశాలు, భద్రత అంశాలపై పలు కీలక శాఖలతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క(Minister Seethakka) ఉన్న‌తస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. మహిళల సమగ్ర సంక్షేమం కోసం శాఖల మధ్య సమన్వయం పెంపొందిస్తూ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఈ సందర్భంగా సూచించారు. అనంతరం మాట్లాడుతూ.. లింగ వివక్షను నిర్మూలించి, మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థలోనే లింగ సమానత్వ భావనను బలపరిచే విధంగా పాఠ్యాంశాలలో మార్పులు చేయాల్సిన అవసరాన్ని చర్చించారు. ఉద్యోగ రంగంలో మహిళలకు సమాన హక్కులు, ప్రైవేటు రంగంలోనూ మ‌హిళ‌ల‌కు మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ అమ‌లు వంటి అంశాలపై విధానపరమైన మార్పులు అవసరమని అభిప్రాయపడ్డారు.

మహిళా భద్రతపై విస్తృత చర్చ

ఈ స‌మావేశంలో మహిళా భద్రత అంశంపై విస్తృత చర్చ జరిగింది. మహిళా, శిశు సంక్షేమ, పోలీస్ శాఖల సమన్వయంతో మ‌హిళా భ‌ద్ర‌త విష‌యంలో ప్ర‌త్యేక వ్య‌వ‌స్థ‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. సైబర్ నేరాలు, సోషల్ మీడియా మోసాలు, డేటింగ్ యాప్స్ మరియు మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా జరుగుతున్న మోసాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు. సమావేశంలో వెలువడిన సూచనల అమలుకు అంశాల వారీగా సబ్ కమిటీలు ఏర్పాటు చేసి, తక్షణమే కార్యాచరణ బృందాలను నియమించాలని మంత్రి శ్రీమతి సీతక్క స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “మహిళల సాధికారతే రాష్ట్ర అభివృద్ధికి పునాది. మహిళలకు భద్రత, సమాన అవకాశాలు, ఆరోగ్యం, గౌరవప్రద జీవనం కల్పించడం ప్రభుత్వ ధర్మం. ఈ సమావేశంలో వచ్చిన ప్రతి సూచనను కార్యాచరణ ప్రణాళికగా మార్చి వేగవంతంగా అమలు చేస్తాం” అని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో డీజీ చారు సిన్హా, పీసీసీఎఫ్ డా. సి. సువర్ణ, మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ దివ్యా దేవరాజన్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టరేట్‌కు చెందిన సంగీతా సత్యనారాయణ, విద్యాశాఖ స్పెషల్ సెక్రటరీ వెంకటేశ్ దోత్రే, మున్సిపల్ శాఖ కమిషనర్లు పాల్గొన్నారు.

Next Story