- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వేసవికి ముందే అలర్ట్.. తాగునీటి సమస్యలు లేకుండా మిషన్ భగీరథపై సీతక్క ఫోకస్
గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఎలాంటి తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఎలాంటి తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా పైపులైన్ మరమ్మతులు లేదా ఇతర పనులు చేయాల్సి వస్తే, గ్రామస్తులకు ముందుగానే సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను సమర్థవంతంగా నిర్వహించాలని ఆమె స్పష్టం చేశారు. వేసవి కాలంలో తాగునీటి అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో మిషన్ భగీరథ పనితీరుపై మంత్రి సీతక్క సచివాలయంలో విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ దివ్య దేవరాజన్, ఇంజినీర్-ఇన్-చీఫ్ కృపాకర్ రెడ్డి, చీఫ్ ఇంజినీర్లు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి సరఫరా పరిస్థితి, నీటి నిల్వల స్థాయి, పంపిణీ వ్యవస్థ పై అధికారులు సమగ్ర వివరాలు మంత్రి ముందు ఉంచారు. అధికారులు సమీక్షలో తెలియజేసిన వివరాల ప్రకారం, రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లు, సోర్స్ పాయింట్ల వద్ద తగిన నీటి నిల్వలు ఉన్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో తాగునీటి కొరత తలెత్తే అవకాశాలు లేవని స్పష్టం చేశారు.
సమ్మర్ స్పెషల్ డ్రైవ్
వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని చేపట్టిన “సమ్మర్ స్పెషల్ డ్రైవ్” విజయవంతంగా పూర్తి చేశామని, అందువల్ల గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా అంతరాయం లేకుండా కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 90 శాతం మంది సర్పంచులతో మాట్లాడి ఫీడ్‌బ్యాక్ సేకరించామని, వారందరూ తాగునీటి సరఫరాపై సంతృప్తి వ్యక్తం చేశారని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, మిషన్ భగీరథ వ్యవస్థ ఇంకా అందుబాటులోకి రాని గ్రామాలు, ముఖ్యంగా మారుమూల ఆదివాసీ గూడాల్లో తాగునీటి కోసం బావులు తవ్వాలనే ప్రజల అభ్యర్థనలు వస్తున్నాయన్నారు. అటువంటి ప్రాంతాల్లో ప్రజల అవసరాలను గుర్తించి, తక్షణమే బోర్లు, బావులు తవ్వే ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా పాండ్స్ ను తవ్వాలని సూచించారు. తద్వారా బుగ్గర బజానాలను పెంచుకోవచ్చని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు.






