ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం: ఐకేపీ కేంద్రాల పర్యవేక్షణపై అధికారులకు సీతక్క దిశానిర్దేశం

by Gantepaka Srikanth |

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మద్దతుగా ఈ యాసంగి సీజన్‌లో ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోళ్లు చేపడుతోంది.

ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం: ఐకేపీ కేంద్రాల పర్యవేక్షణపై అధికారులకు సీతక్క దిశానిర్దేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మద్దతుగా ఈ యాసంగి సీజన్‌లో ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోళ్లు చేపడుతోంది. పక్కా ప్రణాళికతో సెర్ప్​ఆధ్వర్యంలో, జిల్లా డీఆర్డీవోల పర్యవేక్షణలో రాష్ట్రవ్యాప్తంగా వేలాది కొనుగోలు కేంద్రాల ద్వారా లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సజావుగా కొనుగోలు చేస్తున్నారు. రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. డిఆర్డీఏ పర్యవేక్షణలో రాష్ట్రవ్యాప్తంగా 3,563 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇప్పటివరకు 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు చేరుకుంది. అందులో 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు తరలించారు. ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆన్‌లైన్ వ్యవస్థలో నమోదు చేయడం జరిగింది. ఈసారి కొనుగోలు కేంద్రాల నిర్వహణలో మహిళా సంఘాలు విశేష పాత్ర పోషిస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో సుమారు 40 శాతం కేంద్రాలు మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయి. ఐకేపీ కేంద్రాలకు రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని తూకం వేయడం, రికార్డులు నిర్వహించడం, మిల్లులకు తరలించడం, ఆన్‌లైన్‌లో నమోదు చేయడం వంటి ప్రతి దశలో మహిళలు క్రియాశీలకంగా పనిచేస్తున్నారు.

మహిళా సంఘాల సమర్థ నిర్వహణతో కొనుగోలు ప్రక్రియ మరింత క్రమబద్ధంగా సాగుతోందని అధికారులు తెలిపారు. సాధ్యమైన మేర అవసరం ఉన్న ప్రతి గ్రామంలో ప్రారంభిస్తున్నారు. ఏడాది 3400 ఐకేపీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని టార్గెట్ పెట్టుకోగా ఇప్పటికే మరో 100 అదనంగా ఐకెపి కేంద్రాలను ప్రారంభించారు. ఆయా జిల్లాల్లో వరి కోతల ఆధారంగా మరి నీ కేంద్రాలను ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఇలాంటి బాధ్యతలను అప్పగిస్తున్నట్లు వెల్లడించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర మరింత పెరిగేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ఎక్కువసేపు వేచి ఉండకుండా చర్యలు తీసుకోవాలని, ధాన్యం తూకం, తరలింపు, ఆన్‌లైన్ నమోదు ప్రక్రియలను మరింత వేగవంతం చేయాలని సూచించారు. ప్రతి ఐకేపీ కేంద్రంలో సమన్వయంతో పని చేసి రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం సమర్థంగా నిర్వర్తిస్తోందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. మహిళా సంఘాల భాగస్వామ్యంతో కొనుగోలు కేంద్రాల పనితీరు మరింత మెరుగుపడుతోందని ఆమె అభిప్రాయపడ్డారు.

Next Story