- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Seethakka: కేటీఆర్‌కు ఆవేశం ఎక్కువ.. ఆలోచన తక్కువ
కేటీఆర్‌కు ఆవేశం ఎక్కువ.. ఆలోచన తక్కువని, ఒక్క గ్రామానికే కొత్త పథకాలను పరిమితం చేసినట్లుగా భ్రమపడుతున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కేటీఆర్‌కు ఆవేశం ఎక్కువ.. ఆలోచన తక్కువని, ఒక్క గ్రామానికే కొత్త పథకాలను పరిమితం చేసినట్లుగా భ్రమపడుతున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. పథకాలు రాని గ్రామాలు రణరంగంగా మారుతాయన్న కేటీఆర్ వ్యాఖ్యలను మంత్రి సీతక్క ఖండించారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా నూతన పథకాలతో గ్రామాల్లో పండగ వాతావరణం కన్పిస్తుంటే కేటీఆర్ ఓర్వ లేకపోతున్నారని విమర్శించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి మండలంలో ఒక గ్రామంలో నాలుగు నూతన పథకాలను విజయవంతంగా ప్రారంభిస్తే కేటీఆర్ తట్టుకోలేకపోతున్నారన్నారు. ఒక గ్రామంలో పథకాల అమలును లాంఛనంగా మొదలు పెట్టి.. ఇతర గ్రామాలకు విస్తరిస్తారన్న ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, సబ్సిడి గ్యాస్ సిలిండర్ పథకాలు అర్హులందరికీ అందడం లేదా అని ప్రశ్నించారు. ప్రజలను రెచ్చ గొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడమే కేటీఆర్ పని అని మండిపడ్డారు. బీఆర్ఎస్‌లాగా ఎన్నికల లబ్ధి కోసం తాము పథకాలు అమలు చేయడం లేదన్న విషయాన్ని తెలుసుకోవాలని హితవు పలికారు. దళిత గిరిజన కుటుంబాలకు ముడెకరాల భూమి, అన్ని దళిత కుటుంబాలకు దళితబంధు, బీసీలకు బీసీబంధు, మైనారిటీలకు మైనారిటీ బంధు హమీని ఎంత మేర నెరవేర్చారని ప్రశ్నించారు. గత సీఎం కేవలం చింతమడకకే సీఎం అయినట్లు వ్యవహరించి ప్రతి ఇంటికి పది లక్షలు పంచి పెట్టారని మండిపడ్డారు. కానీ తమ ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తోందని తెలిపారు. గత పదేండ్లలో పేదల గృహనిర్మాణాన్ని విస్తరించి, కొత్త రేషన్ కార్డులను ఇవ్వకుండా, ఇప్పుడు మాయమాటలు చెబితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.






