- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Seethakka: దేశానికి గాంధీ సిద్ధాంతమే శ్రీరామరక్ష.. మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు
ఎప్పటికైనా భారతదేశానికి గాంధీ సిద్ధాంతమే శ్రీరామరక్ష అని మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఎప్పటికైనా భారతదేశానికి గాంధీ సిద్ధాంతమే శ్రీరామరక్ష అని మంత్రి సీతక్క (Minister Seethakka) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ (Gandhi Gyan Pratishthan) స్వర్ణోత్సవాల సందర్భంగా (Gandhi Bhavan) గాంధీ భవన్‌లో మహాత్మా గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు - స్వదేశీ మేళలో భాగంగా ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాలకు మంత్రి సీతక్క పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ఏర్పాటు చేసి 50 ఏళ్లు పూర్తయిందన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం అని కొనియాడారు. 1500 గాంధీ విగ్రహాలను ఏర్పాటు చేసి వారి త్యాగాన్ని, ఆలోచన విధానాన్ని దేశానికి సమాజానికి గుర్తు చేస్తున్నారని అన్నారు. ఎప్పటికైనా భారతదేశానికి గాంధీ సిద్ధాంతమే శ్రీరామరక్ష అని, శాంతియుత మార్గంలోనే మనకు విజయం వరిస్తోందన్నారు.
గాంధీ బాటలోనే మనమంతా నడిచి నియంతలను దుర్మార్గులను తరిమి కొట్టామని అన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో గాంధీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని తెలిపారు. మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆలోచన విధానాన్ని గ్రామ గ్రామానికి తీసుకెళ్తున్నామని చెప్పారు. అందులో భాగంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టామని వెల్లడించారు. మహనీయుల దారిలోనే నడిచి ప్రజలకు మేలు చేస్తామని, ఎప్పటికైనా శాంతి సామరస్యతే గెలుస్తాయన్నారు. కాగా, ఈ సదస్సులో చౌటుప్పల్ ట్రినిటీ విద్యాసంస్థల విద్యార్థులు మహాత్మా గాంధీ వేషధారణలో వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. గాంధీ బోధించిన స్వదేశీ భావనలు, సుస్థిర జీవన ప్రాముఖ్యతను ఈ సదస్సు చాటిచెప్పింది.






