Seethakka: 15 ఏళ్లు పూర్తి చేసిన అమ్మాయిలకు ప్రత్యేక సంఘాలు: మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

త్వరలో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న అమ్మాయిల కోసం బాలికా సంఘాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు.

Seethakka: 15 ఏళ్లు పూర్తి చేసిన అమ్మాయిలకు ప్రత్యేక సంఘాలు: మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: త్వరలో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న అమ్మాయిల కోసం బాలికా సంఘాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సీతక్క (Minister Seethakka) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Indira Priyadarshini Government Degree College) విద్యార్థినుల బతుకమ్మ వేడుకల్లో ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. మనందరికీ స్ఫూర్తి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అని, ఆమె పేరుపై నెలకొల్పిన ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులంతా స్ఫూర్తితో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. తెలంగాణకు పెద్ద పండుగ బతుకమ్మ అని, మహిళల సామూహిక జీవన విధానానికి ఈ పండుగ నిదర్శనం అని చెప్పారు. చెరువులే తెలంగాణకు జీవనాధారం అని, అందుకే బతుకు నిచ్చిన చెరువులకు పూజలు చేసుకోవడమే బతుకమ్మ పండుగ అని వివరించారు.

మనం ఎంత ఎత్తుకు ఎదిగినా బతుకమ్మ చరిత్రను మర్చిపోవద్దని సూచించారు. తాత్కాలిక వైఫల్యాలతో విద్యార్థులు వెనకడుగు వేయవద్దని, అట్రాక్షన్ కోసం తప్పుడు మార్గాల్లో వెళ్లొద్దని సూచించారు. అమ్మాయిలకు విద్య అనేది ఎంతో ముఖ్యమని తెలిపారు. నక్సలైట్ ఉద్యమంలో పనిచేసి ఒక నిందితురాలిగా కోర్టులో జడ్జిల ముందు నిలబడే దాన్ని.. కానీ ఆ తర్వాత నేనే అడ్వకేట్ నైనా కేసును నేనే వాదించుకున్నా.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి మంత్రిగా సేవ చేస్తున్నట్లు గుర్తుచేశారు. బతుకమ్మ స్ఫూర్తితో పదిమందికి ఆదర్శంగా అమ్మాయిలు విజయాలు అందుకోవాలన్నారు. మీ కాలేజీ కి కావాల్సిన అదనపు తరగతి గదులను నిర్మించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి క్లాస్ రూములు కట్టించి ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.

Next Story