గ్రామ పంచాయతీలకు రూ.259.36 కోట్లు విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్: సీతక్క కీలక విజ్ఞప్తి

by Ramesh Naini |

గ్రామాల అభివృద్ధికి కీలకమైన 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

గ్రామ పంచాయతీలకు రూ.259.36 కోట్లు విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్: సీతక్క కీలక విజ్ఞప్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామాల అభివృద్ధికి కీలకమైన 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వుల మేరకు గ్రామ పంచాయతీలకు తొలి విడతగా రూ.259.36 కోట్లను విడుదల చేసింది. 2024–25, 2025–26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రానికి రావాల్సి ఉన్నప్పటికీ, పలు కారణాల వల్ల గత రెండేళ్లుగా నిలిచిపోయాయి. బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం, దానిపై వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు కారణంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆలస్యం కావడం ఈ జాప్యానికి ప్రధాన కారణంగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయిన తరువాతే పెండింగ్ నిధులు విడుదల చేస్తామని ప్రకటించింది. ఎన్నికలు లేని పరిస్థితిలో నిధుల విడుదల సాధ్యం కాదన్న కేంద్ర వైఖరి కారణంగా గ్రామ పంచాయతీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అయితే కేంద్ర మంత్రులతో రాష్ట్ర పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మంత్రి సీతక్క పలు దఫాలు విజ్ఞప్తులు చేశారు. గ్రామ పంచాయతీల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మంత్రి సీతక్క ఢిల్లీలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో పాటు ఇతర కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర పరిస్థితిని వివరించారు.

కేంద్రం దృష్టికి తీసుకెళ్లి..

గ్రామ స్థాయిలో అభివృద్ధి పనులకు ఆటంకాలు ఎదురు కావడం, ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి నిధులు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ, ఎన్నికలు పూర్తి కాకపోవడం కారణంగా నిధుల విడుదల సాధ్యపడలేదు. ఎన్నికల అనంతరం నిధుల విడుదలకు మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ చూపారు. మార్చి 31 లోపు నిధులు విడుదల కాకపోతే నిధులు శాశ్వతంగా రద్దు అయ్యే ప్రమాదం ఉండటంతో ప్రక్రియను వేగవంతం చేశారు. సంబంధిత శాఖ అధికారులతో పలుసార్లు సమీక్షలు నిర్వహించి నిధులు తీసుకువచ్చే దిశలో దిశా నిర్దేశం చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తికావడంతో పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలంటూ మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. కేంద్ర శాఖలతో నిరంతర సంప్రదింపులు జరిపారు. అదే సమయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్. శ్రీధర్, ఇతర అధికారులు కూడా నిరంతరంగా కేంద్రంతో ఉత్తర ప్రత్యుత్తరాలతో నిధుల విడుదలకు కృషి చేశారు. ఈ ప్రయత్నాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల ప్రక్రియను ప్రారంభించింది.

రూ.3 వేల కోట్ల వరకు నిధులు పెండింగ్

15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ట్రానికి మొత్తం సుమారు రూ. 3 వేల కోట్ల వరకు రావాల్సి ఉంది. అందులో తొలి విడతగా రూ.259.36 కోట్లను విడుదల చేయడం పట్ల గ్రామ పంచాయతీల్లో ఆశలు చిగురించాయి. మిగిలిన నిధులను కూడా దశలవారీగా విడుదల చేయాల్సి ఉంది. గ్రామ పంచాయతీలకు ఎంతో కీలకమైన నిధులు విడుదల కావడంపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఈ నిధులతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని, అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని తెలిపారు.

Next Story