తెలంగాణ విజన్ డాక్యుమెంట్–2047లో మహిళా సాధికారత, ఆర్థిక అభివృద్ధికి పెద్ద పీట : మంత్రి సీత‌క్క‌

by Muthe.Rajitha |

తెలంగాణ విజన్ డాక్యుమెంట్–2047రూపకల్పనలో భాగంగా మహిళల సాధికారత, ఆర్థిక అభివృద్ధి, సంరక్షణ పోషకాహారం అంశాలపై చేపట్టాల్సిన కీలక చర్యలపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మంగళవారం ప్రజాభవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు.

తెలంగాణ విజన్ డాక్యుమెంట్–2047లో మహిళా సాధికారత, ఆర్థిక అభివృద్ధికి పెద్ద పీట : మంత్రి సీత‌క్క‌
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ విజన్ డాక్యుమెంట్–2047రూపకల్పనలో భాగంగా మహిళల సాధికారత, ఆర్థిక అభివృద్ధి, సంరక్షణ పోషకాహారం అంశాలపై చేపట్టాల్సిన కీలక చర్యలపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మంగళవారం ప్రజాభవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజ, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ పాల్గొన్నారు. సమావేశంలో మహిళల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణకు సంబంధించి విభిన్న అంశాలపై మంత్రి సీతక్క పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. తెలంగాణ మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 52.7 శాతంగా ఉందని, దానిని 2047 నాటికి 95 శాతానికి చేరేలా విజన్ డాక్యుమెంట్ రూపకల్పన చేయాలని సూచించారు.

మహిళల ఉపాధి ఉద్యోగ అవకాశాలను విస్తృతంగా పెంచేందుకు సమగ్రమైన వ్యూహం ఉండాలని ఆమె స్పష్టం చేశారు. మహిళల సంరక్షణ, పోషకాహారం ప్రధాన లక్ష్యాలుగా ఉండాలని మంత్రి పేర్కొన్నారు. కోటి మంది మ‌హిళ‌ల‌కు కోటిశ్వ‌రులను చేసే ల‌క్ష్యంతో విభిన్న వ్యాపారాల్లో మ‌హిళ‌ల‌ను ప్రొత్స‌హించేలా విజ‌న్ 2047 డాక్యుమెంట్ ఉండేలా చూడాల‌న్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మహిళా సంఘాల ద్వారా యూనిఫాంలు కుట్టించడాన్ని ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఏడాది మహిళా సంఘాలకు రూ. 30 కోట్లు పైగా ఆదాయం లభిస్తోందని చెప్పారు.

ప్రైవేట్ రంగంలో కూడా మహిళా సంఘాల నైపుణ్యాన్ని వినియోగిస్తూ, ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్లు, హాస్టళ్లలో విద్యార్థుల యూనిఫామ్ తయారీ పనులు మహిళా సంఘాలకే అప్పగించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. అలాగే 2047 విజన్ ప్రకారం అన్ని మహిళలకు యూనివర్సల్ చైల్డ్ కేర్, యూనివర్సల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అందించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ఆమె పేర్కొన్నారు.

Next Story