- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాల్టా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి: సీతక్క
పర్యావరణ హితంలో ప్రజల అభివృద్ధి కోణంలో వాల్టా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: పర్యావరణ హితంలో ప్రజల అభివృద్ధి కోణంలో వాల్టా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం సచివాలయంలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొట్టమొదటి సారిగా వాల్టా రాష్ట్రస్థాయి అథారిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ..మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వాల్టా అథారిటీలను నియమించాలన్నారు. సహజ వనరులను దుర్వినియోగం చేయకుండా, అవసరం మేరకే వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. వాల్టా చట్టం పై వారం రోజులపాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, ప్రజల భాగస్వామ్యాన్ని విస్తృతంగా పెంచాలన్నారు.
ఎంపీలు ఎమ్మెల్యేలు స్థానిక అధికారులతో కమిటీలు వేసి సమావేశాలు పెట్టాలన్నారు. భవిష్యత్ తరాల కోసం పర్యావరణహితం కోసం వాల్టా చట్టాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. వాల్టా రాష్ట్రస్థాయి అథారిటీ మొదటి సమావేశంలో జిల్లాస్థాయి, డివిజనల్ స్థాయి, మండల స్థాయి వాల్టా అథారిటీల ఏర్పాటు, భూగర్భ జలాలు ప్రమాదకరస్థాయిలో తగ్గుతున్న గ్రామాల్లో, పట్టణాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెంచాలి, వర్షపు నీటి సంరక్షణ, ఇంకుడు గుంతల నిర్మాణంను తప్పనిసరి చేయాలి, వాల్టానిధి ఏర్పాటు చేయాలని క్యాబినెట్ కు సిఫార్సు, గ్రామాల వారీగా నీటి వనరులు, బోర్లు, బావుల సమాచార సేకరణ, వాల్టా యాక్ట్ అమలు ను హైడ్రాకూ వర్తింపు వంటి అంశాలపై చేసిన తీర్మానాలు చేశారు.
ఎక్స్అఫిషియో సభ్యులు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కార్యదర్శి లోకేష్ కుమార్, డైరెక్టర్ సృజన, స్పెషల్ కమిషనర్ షఫీ ఉల్లా, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అహ్మద్ నదీమ్, ప్రముఖ పర్యావరణ వేత్త దుశ్చర్ల సత్యనారాయణ, ఇరిగేషన్, గ్రౌండ్ వాటర్ శాఖ అధికారులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. పదేళ్లుగా విస్మరించిన వాల్టా అథారిటీ సమావేశాన్ని నిర్వహించిన ప్రభుత్వాన్ని పలు శాఖల అధికారులు, ప్రొఫెసర్లు శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు పర్యావరణ కార్యకర్తలు అభినందించారు. వాల్టా రాష్ట్రస్థాయి సమావేశానికి హాజరై వాల్టా పటిష్టత కోసం సూచనలు చేసిన ఓయూఐ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజశేఖర్, ఓయూ జియాలజీ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి, సాయిల్ సైన్సెస్ సైంటిస్ట్ ఎం ఉమాదేవి, జలసాధన సమితి అధ్యక్షులు దుశ్చర్ల సత్యనారాయణ, పర్యావరణ కార్యకర్తలు దైద వెంకన్న, గుండేటి యోగేశ్వర్, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, హైడ్రాలజీ, గ్రౌండ్ వాటర్, అటవీ పర్యావరణ శాఖ ప్రతినిధులకు మంత్రి సీతక్క ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.






