- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
2047 నాటికి జీరో ఎమిషన్ మొబిలిటీ లక్ష్యం.. గ్లోబల్ సమ్మిట్‌లో మంత్రి పొన్నం ప్రసంగం
గ్లోబల్ తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగవంతం చేయడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: గ్లోబల్ తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగవంతం చేయడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. ఇవాళ గ్లోబల్ తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌లో మంత్రి పొన్నం ప్రసంగించారు. కాలుష్య నియంత్రణ, ప్రజారోగ్యం, ఇంధన భద్రత, పట్టణ నివాసయోగ్యతకే కాదు, ఆర్థిక వృద్ధికి కూడా క్లీన్ మొబిలిటీని రాష్ట్రం ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. తెలంగాణ 2047 నాటికి దేశంలో జీరో ఎమిషన్ మొబిలిటీకే దిక్సూచిగా మారడమే లక్ష్యమని స్పష్టం చేశారు. గ్రీన్ మొబిలిటీ నినాదం కాదు.. తెలంగాణ భవిష్యత్ వృద్ధికి పునాది.. అని మంత్రి పొన్నం పేర్కొన్నారు.
EVలకు భారీ ప్రోత్సాహాలు
G.O.Ms.41 (16.11.2024) ప్రకారం 2026 డిసెంబర్ 31 వరకు అన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ రుసుములపై 100% మినహాయింపు అమల్లో ఉందని తెలిపారు. దీనివల్ల EV వినియోగం 0.60% (2023) నుండి 1.39% (2025)కు పెరిగిందని చెప్పారు. రెండు ఏళ్లలో రూ.806.85 కోట్లు విలువైన పన్ను రాయితీలతో 1.59 లక్షల EVలకు మద్దతు లభించిందన్నారు.
స్క్రాపేజ్ పాలసీ అమలు వేగం
2024లో ప్రకటించిన వాహన స్క్రాపేజ్ పాలసీ కింద గ్రీన్ టాక్స్ మినహాయింపులు, జరిమానాల రద్దు, కొత్త వాహనాలపై పన్ను రాయితీలు అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మూడు స్క్రాపింగ్ సెంటర్లు పనిచేస్తుండగా, 2024–26 మధ్య 5,400కు పైగా వాహనాలు స్క్రాప్ చేసినట్లు పొన్నం వివరించారు.
ATSలు, డిజిటల్ రవాణా సంస్కరణలు
జిల్లాల వారీగా 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు (ATS) ఏర్పాటు చేస్తున్నామని, మొదటి దశలో 15 స్టేషన్లకు టెండర్లు జరుగుతున్నాయని చెప్పారు. ఫిట్‌నెస్ టెస్టింగ్‌లో పారదర్శకత, ఖచ్చితత్వం పెరుగుతుందని పేర్కొన్నారు.
ORR ఆటో రిఫార్మ్
హైదరాబాద్‌లో స్థిరమైన లాస్ట్-మైల్ కనెక్టివిటీ కోసం 20,000 ఎలక్ట్రిక్, 10,000 CNG, 10,000 LPG ఆటోలు, 25,000 రెట్రోఫిట్ EV ఆటోలకు అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. ORR పరిధిలో పెట్రోల్-డీజిల్ ఆటో అనుమతులు రద్దు చేశామని తెలిపారు.
ప్రభుత్వం- EVల మొదటి వినియోగదారు
అన్ని శాఖలు ఏటా కనీసం 25% వాహనాలను EVలుగానే కొనుగోలు చేయాలనే ప్రతిపాదన తీసుకొచ్చామని చెప్పారు. బలమైన ఛార్జింగ్ నెట్‌వర్క్, బ్యాటరీ రీసైక్లింగ్, నైపుణ్యాభివృద్ధి, ఎలక్ట్రిక్ బస్సులు, AI ఆధారిత పర్యవేక్షణ వంటి చర్యలను మంత్రి వివరించారు.






