- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండోసారి పట్టుబడితే వాహనం సీజ్ చేయండి.. అధికారులకు మంత్రి పొన్నం ఆదేశం
తెలంగాణ రావాణా శాఖ అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు(Road Accidents) తగ్గించడానికి కొద్ది రోజులుగా రవాణా శాఖ అమలు చేస్తున్న సంస్కరణలను మరింత కఠినతరం చేసేలా రవాణా శాఖ ఉన్నతస్థాయి అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) సమీక్షా సమావేశం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలను పూర్తిగా తగ్గించి మరణాల రేటును నివారించే విధంగా అధికారులు పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఇందుకోసం ఎన్ఫోర్స్మెంట్ వేగవంతం చేయడానికి ఇటీవల రవాణా శాఖలో 33 జిల్లా స్థాయి బృందాలు, మూడు రాష్ట్రస్థాయి ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసింది. ఇందులో డీటీసీ, ఆర్టీఏ ఇతర అధికారులు నిరంతరం తనిఖీలు చేపడుతున్నారు. తనిఖీలు ఏ బృందం ఎక్కడ చేపడుతుంది అనేదానిపై ముందస్తు సమాచారం లేకుండా ప్రతిరోజు ఉదయం 6 గంటలకి ఆయా బృందాలకు సమాచారం అందించి తనిఖీలు చేపట్టింది.
గత 10 రోజుల వ్యవధిలో తనిఖీలు చేపట్టడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు నిబంధనలు ఉల్లంఘించిన వారిపైన 4748 కేసులు నమోదు చేయబడ్డాయి. మొత్తం 3420 వాహనాలు సీజ్ చేయబడ్డాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్ఫోర్స్మెంట్ బృందాలు తనిఖీలు మరింత ముమ్మరం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు ఓవర్ లోడ్ వల్లే అధికంగా జరుగుతుండడంతో దాని మీద ఎక్కువగా దృష్టి సారించారు. ఓవర్ లోడ్ అయిన వాహనాలు సీజ్ చేయడంతో పాటు, రెండోసారి ఓవర్ లోడ్‌తో వాహనం పట్టుబడితే ఆ వాహనం పర్మిట్ రద్దు చేయడం, వాహనం నడుపుతున్న డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేసేలా చర్యలు తీసుకోనున్నారు. అయితే ఓవర్ లోడ్ పై మైనింగ్ శాఖతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడైతే వాహనాల లోడింగ్ జరుగుతుందో అక్కడే నివారించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. సమీక్షా సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు రమేష్, చంద్రశేఖర్ గౌడ్, శివ లింగయ్యలు పాల్గొన్నారు.






