ఇది రాష్ట్ర ప్రతిష్టను మరింత పెంచుతుంది.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

హైదరాబాద్ వేదికగా జరుగుతున్న భారత్ సమ్మిట్ ద్వారా ప్రపంచ దేశాలకు తన సామర్థ్యాన్ని తెలంగాణ చాటిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

ఇది రాష్ట్ర ప్రతిష్టను మరింత పెంచుతుంది.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ వేదికగా జరుగుతున్న భారత్ సమ్మిట్ ద్వారా ప్రపంచ దేశాలకు తన సామర్థ్యాన్ని తెలంగాణ చాటిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. భారతదేశం రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో చూపుతున్న పురోగతిని ప్రపంచానికి తెలియజేసే వేదికగా ఈ సమ్మిట్ నిలుస్తోందన్నారు. సమ్మిట్‌లో పాల్గొన్న అంతర్జాతీయ ప్రతినిధుల ప్రశంసలు తెలంగాణ పరిపాలన శైలికి గర్వకారణమని మంత్రి అభిప్రాయపడ్డారు. తెలంగాణలో జరుగుతున్న భారత్ సమ్మిట్ దేశానికి మాత్రమే కాకుండా ప్రపంచానికి కూడా కీలక సందేశాన్ని పంపుతోందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, శాంతి స్థాపన, అభివృద్ధి లక్ష్యాల దిశగా ఈ సమ్మిట్ దోహదపడుతోందని ఆయన అన్నారు. ఇటువంటి ఘనమైన కార్యక్రమం తెలంగాణలో జరుగుతుండటం గర్వకారణమని, ఇది రాష్ట్ర ప్రతిష్ఠను మరింత పెంచుతుందని పేర్కొన్నారు. ఇక యువత రాజకీయాల్లోకి రావడం వల్ల దేశ భవిష్యత్తుకు ఎంతో మేలుకలుగుతుందని మంత్రి తెలిపారు. రాజకీయాల్లో నవచైతన్యం రావాల్సిన అవసరం ఉంది, యువత రాజకీయాల్లోకి రావడం ద్వారా సామాజిక న్యాయం, సమానత, పారదర్శకత సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సమ్మిట్ యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని, వారు దేశ నిర్మాణంలో భాగస్వాములవ్వాలన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story