బీసీ కులగణన.. సీఎల్పీ తర్వాత మీ ముందుకు వస్తాం.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

బలహీన వర్గాలకు న్యాయం జరగాలని తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో బీసీ కులగణన శాస్త్రీయ పద్ధతిలో జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

బీసీ కులగణన.. సీఎల్పీ తర్వాత మీ ముందుకు వస్తాం.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బలహీన వర్గాలకు న్యాయం జరగాలని తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో (caste census) బీసీ కులగణన శాస్త్రీయ పద్ధతిలో జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) వెల్లడించారు. ఈ మేరకు ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్‌ల ఆధ్వర్యంలో దాదాపు లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులను గ్రామాల్లో ఇంటి ఇంటికి పంపి సమాచారం సేకరించారని తెలిపారు. కొంత మంది బలహీన వర్గాల మేదావులు, సంఘాల వారు ఏదో తప్పు జరిగినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బలహీన వర్గాలకు న్యాయం చేయాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. కుల గణన లెక్కల విషయంలో మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడానికి సిద్ధం.. అని సవాల్ చేశారు.

బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా ఒక రోడ్ మ్యాప్ ఇవ్వాలని డిమాండ్ చేద్దాం.. నివేదిక అమలు జరిగేందుకు అందరం కలిసి ముందుకు పోదామని విజ్ఞప్తి చేశారు. ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేయడానికి మీ దగ్గరకు రావడానికి సిద్ధంగా ఉన్నాం.. అని వెల్లడించారు. ప్రెస్ మీట్‌లు పెట్టి దయచేసి పబ్లిక్‌ను కన్ఫ్యూజ్ చేయవద్దని, గుడ్డు మీద వెంట్రుకలు లెక్కపెట్టినట్లు కాకుండా.. బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే ప్రభుత్వానికి నిర్ణయాలు, సలహాలు ఇవ్వాలని సూచించారు. నేడు సీఎల్పీ సమావేశం తర్వాత మళ్లీ మీ ముందుకు వస్తామని చెప్పారు. రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, ఆర్. కృష్ణయ్య, మాజీ హైకోర్టు అధికారి పూర్ణ చందర్, జాజుల శ్రీనివాస్ లాంటి వారిని అందరినీ కోరుతున్నా.. సీఎల్పీ సమావేశం జరిగిన తర్వాత మీ దగ్గరికి వస్తాము.. పూర్తి వివరణ ఇస్తామని హామీ ఇచ్చారు.

Next Story