రాష్ట్రవ్యాప్తంగా12 ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు : మంత్రి పొన్నం ప్రభాకర్

by Naga Rani Yarlagadda |

రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యకలాపాలను మరింత విస్తృతంగా చేపట్టి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.

రాష్ట్రవ్యాప్తంగా12 ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు : మంత్రి పొన్నం ప్రభాకర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యకలాపాలను మరింత విస్తృతంగా చేపట్టి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం సెక్రటేరియట్ లో రవాణా శాఖ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాల వారీగా 10 ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు, రాష్ట్ర స్థాయిలో 2 స్పెషల్ స్క్వాడ్‌లను తనిఖీలు ముమ్మరం చేయనున్నాయని ఆయన తెలిపారు. ఓవర్‌లోడింగ్ చేస్తున్న వాహనాలు, త్రైమాసిక పన్నులు చెల్లించని వాహనాలు, ఫిట్‌నెస్ లేని వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్న వాహనాలను అవసరమైతే సీజ్ చేయాలని ఆదేశించారు. చెక్‌పోస్టులు రద్దు చేసిన సమయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను బలోపేతం చేస్తామని ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సిబ్బందిని మరింత సమర్థవంతంగా వినియోగించి తనిఖీలను పెంచాలని సూచించారు.

విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం

విద్యార్థులను తరలించే స్కూల్ బస్సులు, మినీ వ్యాన్‌లకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలని... విద్యార్థుల భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యమని మంత్రి స్పష్టం చేశారు. అనుమతించిన సామర్థ్యానికి మించి విద్యార్థులను తరలిస్తున్నట్లు గుర్తిస్తే సంబంధిత వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు. ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులు నడుపుతున్న విద్యాసంస్థల యాజమాన్యాలపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలు రాష్ట్రంలో పన్నులు చెల్లించకుండా తిరుగుతున్న అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. త్రైమాసిక పన్నులు చెల్లించని వాహన యజమానులపై భారీ జరిమానాలు విధించడంతో పాటు అవసరమైతే వాహనాలను సీజ్ చేయాలని పేర్కొన్నారు. అలాగే ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని స్లీపర్ బస్సుల్లో నిబంధనల ఉల్లంఘనలను ఏమాత్రం ఉపేక్షించవద్దని, ఉల్లంఘనలు గుర్తించిన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. సమీక్షా సమావేశంలో స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్, జెటిసి చంద్రశేఖర్ గౌడ్, డిటిసి రవీందర్ కుమార్, వెంకట రమణ, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story