- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరుద్యోగ యువత ఆశలు నిజం చేస్తాం.. ‘వార్షిక-2025’ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి పొన్నం
నిరుద్యోగ యువత ఆశలకు అనుగుణంగానే ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం వరుస నోటిఫికేషన్లు జారీ చేయబోతోందని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : నిరుద్యోగ యువత ఆశలకు అనుగుణంగానే ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం వరుస నోటిఫికేషన్లు జారీ చేయబోతోందని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. బీసీ స్టడీ సర్కిల్ ప్రచురించిన పోటీ పరీక్షల ప్రత్యేక పుస్తకం ‘వార్షిక 2025’ను ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ పుస్తకానికి సంపాదకత్వం వహించిన బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ యువతను విజేతలుగా నిలిపేందుకు, ‘మేధో తెలంగాణ’ సాధన దిశగా ప్రభుత్వం ఉచిత శిక్షణతో పాటు అవసరమైన స్టడీ మెటీరియల్‌ను అందుబాటులోకి తెస్తోందన్నారు. పోటీ పరీక్షల్లో 20 నుంచి 25 శాతం ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ నుంచే వస్తున్నందున, అభ్యర్థుల సౌకర్యార్థం జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలతో కూడిన ‘వార్షిక 2025’ పుస్తకాన్ని బీసీ స్టడీ సర్కిల్ రూపొందించిందని చెప్పారు.
ఈ పుస్తకంలో కరెంట్ అఫైర్స్‌తో పాటు ఎండోమెంట్స్ ఉద్యోగాల కోసం ప్రత్యేకంగా ‘భారతీయ వైదిక హైందవ విజ్ఞానం’ అంశాన్ని, అలాగే జనరల్ నాలెడ్జ్, రాజ్యాంగం, చరిత్ర, భౌగోళిక శాస్త్రం, తెలంగాణ ఉద్యమం వంటి ముఖ్యమైన సమాచారాన్ని పొందుపరిచినట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా సివిల్స్, గ్రూప్స్, బ్యాంకింగ్, పోలీస్, రైల్వే, ఉపాధ్యాయ ఉద్యోగాలకు ప్రభుత్వం ఉచితంగా అన్ని సౌకర్యాలతో శిక్షణ ఇస్తోందని, యువత దీన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.






