వర్షం వేళ అప్రమత్తం: 'హైడ్రా'కు మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

by Vemula.Srinu Prasad |

వ‌ర్షాకాలం అనునిత్యం అప్ర‌మ‌త్తంగా ఉండి.. న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా హైడ్రా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ర‌వాణాశాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ సూచించారు...

వర్షం వేళ అప్రమత్తం: హైడ్రాకు మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: వ‌ర్షాకాలం అనునిత్యం అప్ర‌మ‌త్తంగా ఉండి.. న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా హైడ్రా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ర‌వాణాశాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ సూచించారు. వాతావ‌ర‌ణంలో వ‌చ్చిన మార్పుల దృష్ట్యా.. నెల రోజుల్లో ప‌డాల్సిన వ‌ర్షం ఒక్క రోజులో.. ఒక్క రోజులో కుర‌వాల్సిన వ‌ర్షం ఒక గంట‌లో ప‌డుతున్న వేళ ప్ర‌తి నిమిషం అప్ర‌మ‌త్తంగా ఉన్న‌ప్పుడే ప్ర‌జ‌లకు వ‌ర‌ద‌ క‌ష్టాలు లేకుండా జాగ్ర‌త్త ప‌డ‌గ‌ల‌న‌మ‌ని అన్నారు. మాన్సూన్ రెస్పాన్స్ టీమ్‌ల‌తో శ‌నివారం జ‌ల‌విహార్‌లో హైడ్రా ఏర్పాటు చేసిన స‌మావేశానికి హైద‌రాబాద్ ఇన్ఛార్జి హోదాలో ముఖ్య అతిథిగా హాజ‌రై మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ దిశానిర్దేశం చేశారు. ఏ నిమిషంలో నిర్ల‌క్ష్యంగా ఉన్నా.. న‌గ‌ర ప్ర‌జ‌లు వ‌ర‌ద‌ముప్పును ఎదుర్కొని ఇబ్బందులు ప‌డాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించారు. వ‌ర్షాకాలం హెచ్చ‌రిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని 150 రోజులు స‌న్న‌ద్ధంగా ఉండాల‌ని సూచించారు. ప్ర‌కృతి వైప‌రీత్యాల వేళ‌ చెట్టుకొమ్మ‌లు విరిగిప‌డ‌డం.. క‌రెంటు తీగ‌లు తెగిప‌డ‌డం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ప్ర‌జ‌ల ప్రాణాల‌కు, ఆస్తుల‌కు ఎలాంటి హాని లేకుండా చూసుకోవాల‌ని సూచించారు.

మాన్సూన్ ఎమ‌ర్జ‌న్సీ టీమ్‌లు (మెట్‌) అన‌డం కంటే.. మాన్సూన్ రెస్పాన్స్ టీమ్‌లుగా పిల‌వ‌డం సంద‌ర్భోచిత‌మ‌ని మంత్రి ఈ సంద‌ర్భంగా సూచించారు. ప్రభుత్వం, హైడ్రా, జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్, అగ్నిమాపక, వాతావరణ శాఖలు 24 గంటల పాటు సమన్వయంతో పనిచేస్తున్నాయని.. ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌ని మంత్రి స్పష్టం చేశారు. గ‌తంలో జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలోని కృష్ణాన‌గ‌ర్ నాలా పూడిక తీత ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించ‌గా.. ప‌రుపులు, మంచాలు నాలాల్లో ప‌డ్డాయ‌ని.. ప్ర‌జ‌లు కూడా బాధ్య‌త‌గా ఉంటే విప‌త్తుల‌ను చాలావ‌ర‌కు నివారించ‌గ‌ల‌మ‌న్నారు. హైడ్రా పనితీరును ప్రశంసించిన ఆయన, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మరింత కృషి చేయాలని సూచించారు.

ఇంకుడుగుంత‌ల‌తో వ‌ర‌ద‌ల‌కు క‌ట్ట‌డి..

వ‌ర‌ద‌ల నియంత్ర‌ణ‌కు గొలుసుక‌ట్టు చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ ఎంత అవ‌స‌ర‌మో.. ప్ర‌తి ఇంటికీ ఇంకుడు గుంత ఉంటే.. చాలావ‌ర‌కు వ‌ర‌ద‌ల క‌ట్ట‌డికి అవ‌కాశం ల‌భిస్తుంద‌ని.. ఆ దిశ‌గా అన్ని శాఖ‌లు క‌ల‌సి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ తెలిపారు. ఇందులో హైడ్రా కీల‌కంగా వ్య‌వ‌హ‌రించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. వ‌ర‌ద క‌ట్ట‌డితో పాటు.. వేస‌వి కాలం నీటి ఎద్దడి నివార‌ణకు ఎంతో దోహ‌ద‌ప‌డుతుంద‌న్నారు. హైడ్రాకు రాష్ట్ర ప్ర‌భుత్వం ఎంత అండ‌గా ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేద‌ని.. ఏ కార్య‌క్ర‌మంలో అయినా.. హైడ్రాను స‌మ‌ర్థించుకుంటూ.. సీఎం చేసిన వ్యాఖ్య‌లే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌న్నారు. హైడ్రా కూడా అంతే బాధ్య‌త‌గా ప్ర‌భుత్వ భూములు, చెరువులు, నాలాలు, పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాలు క‌బ్జా కాకుండా గ‌ట్టి కృషి చేస్తున్న‌ద‌న్నారు. ప్ర‌భుత్వంతో పాటు.. ప్ర‌జ‌ల‌కు కూడా హైడ్రా ప‌నుల‌పై ఎంతో విశ్వాసం ఉంద‌ని.. దానిని నిల‌బెట్టుకోవాల్సిన‌వ‌స‌రం ఉంద‌ని చెప్పారు. హైడ్రాలో ముగ్గురు ఏసీపీలు.. మూడు క‌మిష‌న‌రేట్లతో స‌మ‌న్వ‌యం చేసుకుని ప‌ని చేసే బాధ్య‌త తీసుకోవాల‌న్నారు.

24 X 7 సేవ‌లందించేలా ఏర్పాట్లు..

అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు 51 డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్‌ఎఫ్) బృందాలు, 300 మాన్సూన్ రెస్పాన్స్ టీమ్‌లు, 889 స్టాటిక్ టీమ్‌లు సిద్ధంగా ఉన్నాయని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ తో పాటు.. అద‌న‌పు డైరెక్ట‌ర్ వ‌ర్ల పాప‌య్య చెప్పారు. చెట్లు కూలిన ఘటనలకు తక్షణ స్పందన కోసం 20 బైక్ క్విక్ రెస్పాన్స్ యూనిట్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో నీరు వేగంగా తొలగించేందుకు 371 డీ-వాటరింగ్ పంపులను వ్యూహాత్మక ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు వివరించారు. అదేవిధంగా 60 ఫ్లైఓవర్లు, 38 అండర్‌పాస్‌లు, 705 చెరువులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. వ‌ర్షం ప‌డుతున్న‌ప్పుడు వ‌ర‌దను తొల‌గించ‌డానికి.. వ‌ర్షం లేన‌ప్పుడు వ‌ర‌ద‌కు గ‌ల కార‌ణాల‌పై హైడ్రా బృందాలు దృష్టి పెడ‌తాయ‌న్నారు. హైడ్రా మాన్సూన్ రెస్పాన్స్ టీమ్‌లు 300లుంటే.. అందులో 3600ల మంది అందుబాటులోకి వ‌చ్చిన‌ట్ట‌య్యింద‌న్నారు. అంత‌కు ముందు హైడ్రా అద‌న‌పు క‌మిష‌న‌ర్ ఆర్.సుద‌ర్శ‌న్ మాట్లాడుతూ.. మెట్ కాంట్రాక్ట‌ర్ల‌తో పాటు.. ప‌ని చేసే సిబ్బందికి అన్ని సౌక‌ర్యాలు క‌ల్పించ‌డ‌మే కాకుండా.. వ‌ర్షాకాలం అవ‌స‌ర‌మైన ప‌నిముట్లు అంద‌జేశామ‌ని చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో హైడ్రా ఆర్ఎఫ్వో జ‌య‌ప్ర‌కాష్‌తో పాటు... డీఎప్‌వోలు, ఎస్ఎఫ్‌వోలు పాల్గొని మెట్ బృందాల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.

Next Story