- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజల కోసం పనిచేయండి.. ప్రభుత్వ ఆశయం నెరవేర్చండి: మంత్రి పొంగులేటి
దశాబ్దాల తరబడి తీవ్ర అసంతృప్తితో ఉన్న తెలంగాణ రైతాంగానికి లైసెన్స్‌డ్ సర్వేయర్ల నియామకం రూపంలో రాష్ట్ర ప్రభుత్వం దీపావళి కానుకను అందించిందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: దశాబ్దాల తరబడి తీవ్ర అసంతృప్తితో ఉన్న తెలంగాణ రైతాంగానికి లైసెన్స్‌డ్ సర్వేయర్ల నియామకం రూపంలో రాష్ట్ర ప్రభుత్వం దీపావళి కానుకను అందించిందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం శిల్పకళావేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరై శిక్షణ పొందిన సర్వేయర్లకు లైసెన్స్‌లు పంపిణీ చేసిన కార్యక్రమానికి మంత్రి పొంగులేటి అధ్యక్షత వహించి ప్రసంగించారు. గత ప్రభుత్వం ధరణి పేరిట చేసిన తప్పులను తమ ప్రభుత్వం సరిదిద్దే కార్యక్రమాన్ని చేపట్టిందని ఇందులో భాగంగా 3456 మందికి లైసెన్స్‌లు మంజూరు చేశామని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు నిరుద్యోగ యువతను దృష్టిలోపెట్టుకొని రెవెన్యూలో భాగమైన సర్వే వ్యవస్ధను పటిష్టం చేసేందుకు ఆలోచించి దరఖాస్తులను ఆహ్వానించామన్నారు. దీనికి పదివేల మంది దరఖాస్తు చేసుకోగా ఏడువేల మందికి శిక్షణ ఇచ్చామని, వీరిలో 3456 మంది క్షేత్రస్ధాయిలో తర్ఫీదు పొంది ఎంపికయ్యారని, వీరికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా లైసెన్స్‌లు అందజేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జీపీవో వ్యవస్ధ, భూభారతి, సాదా బైనామాల విషయంలో అలక్ష్యం జరిగినందున సుమారు 9.80 లక్షల దరఖాస్తులు వచ్చాయని వీటిని తమ ప్రజా ప్రభుత్వం దశలవారీగా పరిష్కరిస్తోందని అన్నారు. చిన్న అవకతవకలు జరగకుండా, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేయకుండా ప్రజా, ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా చిత్తశుద్దితో పనిచేయాలని మంత్రి పొంగులేటి సర్వేయర్లను కోరారు. మీరు ఈ లైసెన్స్‌లు పొంది సంతోషించినట్లే ప్రజలను కూడా మీ పనులతో సంతోషించేలా చేయాలని.. తద్వారా ప్రభుత్వానికి పేరుతేవాలని కోరుతూ లైసెన్స్‌డు సర్వేయర్లతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రతిజ్ఞ చేయించారు.






