ఇందిర‌మ్మ ఇండ్ల కోసం మ‌ళ్లీ ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి: మంత్రి పొంగులేటి

by Vemula.Srinu Prasad |

ప‌దేళ్ల బిఆర్ఎస్ పాల‌న‌లో పాల‌కుల‌కు ప్రజ‌లు త‌మ స‌మ‌స్యల‌ను చెప్పుకోవ‌డానికి అవ‌కాశం ఉండేదికాద‌ని, నాటి ప్రభుత్వం పేద‌ల‌కు అర‌కొర‌గా న‌గ‌రానికి 30, 40 కిలోమీట‌ర్ల దూరంలో ఇండ్లు నిర్మిస్తే త‌మ జీవ‌నోపాధి దెబ్బతింటుంద‌న్న ఆందోళ‌న‌తో పేద‌లు ఆ ఇళ్లల్లో అడుగుకూడా పెట్టలేద‌ని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి విమర్శించారు...

ఇందిర‌మ్మ ఇండ్ల కోసం మ‌ళ్లీ ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి: మంత్రి పొంగులేటి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప‌దేళ్ల బిఆర్ఎస్ పాల‌న‌లో పాల‌కుల‌కు ప్రజ‌లు త‌మ స‌మ‌స్యల‌ను చెప్పుకోవ‌డానికి అవ‌కాశం ఉండేదికాద‌ని, నాటి ప్రభుత్వం పేద‌ల‌కు అర‌కొర‌గా న‌గ‌రానికి 30, 40 కిలోమీట‌ర్ల దూరంలో ఇండ్లు నిర్మిస్తే త‌మ జీవ‌నోపాధి దెబ్బతింటుంద‌న్న ఆందోళ‌న‌తో పేద‌లు ఆ ఇళ్లల్లో అడుగుకూడా పెట్టలేద‌ని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి విమర్శించారు. తమ ప్రభుత్వం పేద‌వాడు పుట్టి పెరిగిన చోటే నివాసం క‌ల్పించాల‌న్న ఆలోచ‌న‌తో నియోజ‌క‌వ‌ర్గాన్ని యూనిట్‌గా తీసుకొని ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్ నిర్మిస్తున్నామ‌ని, పైల‌ట్ ప్రాజెక్ట్‌గా 16 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ ఇందిరమ్మ ట‌వ‌ర్స్ నిర్మిస్తున్నామ‌ని ఆయన వెల్లడించారు. ఇప్పుడు తాము నిర్మించ‌బోయే ఇండ్ల విలువ 40 లక్షల నుంచి కోటి రూపాయిల వ‌ర‌కు ఉంటుంద‌ని ఇంటిస్దలంలో వాటా కూడా క‌ల్పిస్తున్నామ‌ని ఆయన తెలిపారు.

బుధ‌వారం గాంధీభ‌వ‌న్‌లో ప్రజ‌ల‌తో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజ‌ల నుంచి విన‌తి ప‌త్రాల‌ను స్వీక‌రించారు. కొన్ని స‌మ‌స్యల‌పై అక్కడిక‌క్కడే క‌లెక్టర్లకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అనంత‌రం పొంగులేటి శ్రీనివాస రెడ్డి మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే సీఎం రేవంత్ రెడ్డి సూచ‌న‌ల మేర‌కు ప్రతి వారం ఒక మంత్రి ప్రజ‌ల‌తో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటున్నారని, వీలైనంత‌వ‌ర‌కు ప్రజా స‌మ‌స్యల ప‌రిష్కారానికి కృషి చేస్తున్నామ‌న్నారు. తాను నిర్వహించిన ఈ ముఖాముఖిలో చాలా వ‌ర‌కు ఇండ్ల గురించి ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయ‌ని మంత్రి పొంగులేటి తెలిపారు. గ‌తంలో ఇందిర‌మ్మ ఇండ్ల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నవారు ఈ ఇండ్ల కోసం మీ సేవ, వాట్సాప్‌, వెబ్‌సైట్ ద్వారా క్యూర్ పరిధిలో మ‌రోసారి ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని ఆయన సూచించారు. భూముల‌కు సంబంధించిన వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల్లో ప‌రిష్కరించ‌గ‌ల‌గిన అన్నింటికీ పరిష్కారం చూపిస్తామ‌న్నారు. ఈ ప్రభుత్వంలోనే త‌మ సొంతింటి క‌ల నెర‌వేతుంద‌నే ఆశతో ప్రజ‌లు ఉన్నారని, వారి ఆశ‌ల‌కు అనుగుణంగా త‌మ ప్రభుత్వం మొద‌టి విడ‌త‌లో 4.50 ల‌క్షలు, రెండో విడ‌త‌లో 2.50 ల‌క్షలు మొత్తం 7 ల‌క్షల ఇండ్లను మంజూరు చేసింద‌ని మంత్రి పొంగులేటి తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖ‌రికి నిద‌ర్శనం..

దేశంలో యువ‌త‌ను దెబ్బతీసిన నీట్ ప‌రీక్ష లీకేజీపై శాంతియుతంగా ఢిల్లీలో ధ‌ర్నా చేస్తున్న యువ‌త‌పైన‌, మ‌ద్దతు తెలిపిన కాంగ్రెస్ అగ్రనేత‌లు మ‌ల్లిఖార్జన్ ఖ‌ర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీల‌పై లాఠీఛార్జి చేయ‌డం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖ‌రికి నిద‌ర్శన‌మ‌ని మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిప‌క్షాల‌కు స‌మాధానం చెప్పలేక పార్లమెంటును ప‌లుమార్లు వాయిదా వేయ‌డం, స‌మ‌స్య ప‌రిష్కారానికి చ‌ర్యలు తీసుకోక‌పోవ‌డం ప్రభుత్వ చేత‌కానిత‌నానికి నిదర్శమని మండిపడ్డారు. త‌క్షణ‌మే ప్రధాని మోదీ, మంత్రి ధ‌ర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి డిమాండ్ చేశారు. నీట్ ప‌రీక్ష రాసిన 22 ల‌క్షల మంది అభ్యర్దుల‌కు తెలంగాణ ప్రభుత్వం అండ‌గా ఉంటుందన్నారు.

Next Story