TG: పండుగ పూట ప్రజలకు ఇబ్బందులు రావద్దు.. అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం

by Gantepaka Srikanth |

తెలంగాణలో అతిపెద్ద పండుగైన దసరాకు ముఖ్యంగా హైదరాబాద్ నగరం నుంచి ప్రజలు సొంత గ్రామాలకు వెళతారని, వారి రవాణాకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు.

TG: పండుగ పూట ప్రజలకు ఇబ్బందులు రావద్దు.. అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో అతిపెద్ద పండుగైన దసరాకు ముఖ్యంగా హైదరాబాద్ నగరం నుంచి ప్రజలు సొంత గ్రామాలకు వెళతారని, వారి రవాణాకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. భారీ వర్షాలపై సీఎం రేవంత్‌రెడ్డి సూచన మేరకు మంత్రి శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, డీజీపీ జితేందర్‌తో కలిసి కలెక్టర్లు, ఎస్పీలు, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయాలని సూచించారు. పలు జిల్లాల్లో వచ్చే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లతోపాటు సంబంధిత శాఖలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గడిచిన 24 గంటల్లో భారీ వర్షాలు కురిసిన ప్రధానంగా రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో చేపట్టాల్సిన చర్యలపై మార్గనిర్దేశం చేశారు. ఇరిగేషన్, రవాణా, విద్యుత్, హైడ్రా, జీహెచ్ఎంసీ, రెవెన్యూ విభాగాలు సమన్వయంతో పనిచేసి జనజీవనానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

వికారాబాద్ జిల్లాలో కురిసిన అతిభారీ వర్షాల వల్ల మూసీ నదిలోకి భారీ వరద వస్తున్నదని, దీనిని దృష్టిలో పెట్టుకొని మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. అవసరమైనచోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే శివాజీ బ్రిడ్జి కింద భూలక్ష్మీ ఆలయం సమీపంలోని లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 55 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు వెల్లడించారు. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాలకు భారీగా వరద వస్తున్నందున ముందు జాగ్రత్త చర్యగా వస్తున్న వరదను అంచనా వేసి అంతే పరిమాణంలో ఈ రెండు జలాశయాల నుంచి దిగువకు నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అవసరమైతే షెల్టర్ హోమ్‌లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలో చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండాయని, రాబోయే వర్షాల వల్ల గండ్లు పడకుండా నీటిపారుదల శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లో-లెవెల్ కాజ్‌వేల వద్ద ప్రమాదాలు జరగకుండా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రెస్క్యూ ఆపరేషన్ టీమ్‌లను, అలాగే ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించాలని ఆదేశించారు.

Next Story