TG: తొల‌గిన కోర్టు స్టే.. ద‌ర‌ఖాస్తుల‌కు పరిష్కారం

by Gantepaka Srikanth |

గ‌త ప్రభుత్వం అక్రమంగా తీసుకొచ్చిన ధ‌ర‌ణి పోర్టల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కు బంగాళాఖాతంలో క‌లిపేశారని, దేశంలోని 18 రాష్ట్రాల‌లో అధ్యయ‌నం చేసి భూభార‌తి -2025 చ‌ట్టాన్ని రూపొందించామ‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.

TG: తొల‌గిన కోర్టు స్టే.. ద‌ర‌ఖాస్తుల‌కు పరిష్కారం
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ‌త ప్రభుత్వం అక్రమంగా తీసుకొచ్చిన ధ‌ర‌ణి పోర్టల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కు బంగాళాఖాతంలో క‌లిపేశారని, దేశంలోని 18 రాష్ట్రాల‌లో అధ్యయ‌నం చేసి భూభార‌తి -2025 చ‌ట్టాన్ని రూపొందించామ‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. బుధ‌వారం గ‌చ్చిబౌలిలోని తాలిమ్‌లో ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేష‌న్ భ‌వ‌న నిర్మాణానికి శంకుస్థాప‌న సంద‌ర్భంగా ఏర్పాటైన స‌భ‌లో మంత్రి పొంగులేటి ప్రసంగించారు. రోల్ మోడ‌ల్‌గా నిలిచిన ఈ భూభార‌తి చ‌ట్టం మేర‌కు రైత‌న్నల, ప్రజ‌ల స‌మ‌స్యలు ప‌రిష్కరించేందుకు స‌ద‌స్సులు నిర్వహించ‌గా 8.60 ల‌క్షల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయ‌ని తెల‌పారు. వీటిలో 2ల‌క్షల ద‌ర‌ఖాస్తులు ప‌రిష్కారం కాగా సుమారు 4 ల‌క్షల సాదాబైనామా ద‌ర‌ఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయ‌ని వివ‌రించారు. రాష్ట్ర హైకోర్టు సాదాబైనామాల‌పై ఉన్న స్టేను తొలగించినందున అర్హత క‌లిగిన ద‌ర‌ఖాస్తుల‌ను సాధ్యమైనంత త్వర‌గా ప‌రిష్కరిస్తామ‌ని ప్రక‌టించారు.

అలాగే.. రాష్ట్రంలో అన్ని స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌ను ద‌శ‌ల వారీగా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేష‌న్ భ‌వ‌నాల ప‌రిధిలోకి తీసుకువ‌స్తామ‌ని వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి బాగా లేకున్నా సీఎం నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండు క‌ళ్లుగా ముందుకు సాగుతున్నామ‌ని చెప్పారు. గ‌త ప్రభుత్వ త‌ప్పుల‌ను గ‌మ‌నించి ప్రజ‌లు ఇందిర‌మ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నార‌ని.. ప్రజ‌ల న‌మ్మకాన్ని వమ్ము చేయ‌కుండా ప్రగ‌తి సాధ‌న‌లో సాగుతున్నామ‌ని తెలిపారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ ప‌రిధిలో గ‌ల 39 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్ట్రేష‌న్ల రూపేణా సుమారు 62-63 శాతం ఆదాయం ల‌భిస్తున్నద‌ని, వీటిని 11 ఇంటిగ్రేటెడ్ భ‌వ‌నాల ప‌రిధిలోకి తీసుకువ‌స్తామ‌ని తెలిపారు. ఈ భ‌వ‌నం అత్యాధునిక కార్పొరేట్ స్థాయిలో ఉండ‌బోతున్నద‌ని, సుమారు మూడు ఎక‌రాలలోని దాదాపు 50 వేల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో, 300 కార్లు పార్కింగ్ సౌక‌ర్యం త‌దిత‌రాల‌తో నిర్మాణం కాబోతున్నదని చెప్పారు. ఫైవ్ స్టార్ సౌక‌ర్యాలు సుమారు 8-9 నెల‌ల్లో ఈ భ‌వ‌నాన్ని నిర్మిస్తామ‌ని నిర్మాణ‌ సంస్థ చెబుతున్నట్లు తెలిపారు. 6-7 నెల‌ల్లోగా పూర్తి చేయాల‌ని మంత్రి స‌భా ముఖంగా కోరారు.

ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేష‌న్ భ‌వ‌నంలోని ప్రత్యేకత‌లు

బిల్డింగ్ నిర్మాణ వ్యయం = రూ.30 కోట్లు

మొత్తం స్థలం = 3 ఎక‌రాలు

భ‌వ‌న వివ‌రాలు = 3 ఫ్లోర్‌లు

ఒక్కో ఫ్లోర్ = 16,000 చ‌ద‌ర‌పు అడుగులు

మొత్తం = 48,000 చ‌ద‌ర‌పు అడుగులు

డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ = 250 రోజుకు

ఆదాయం = రూ.2,800 కోట్ల ఏడాదికి

అధికారులు = 6 ఎస్‌ఆర్‌‌వోలు, 1 డీఆర్‌‌వో, 1 డీఐజీ

మరిన్ని ప్రత్యేకతలు..

వెయిటింగ్ హాల్, టోకెన్ సిస్టమ్‌, వివాహ రిజిస్ట్రేష‌న్ కోసం వ‌చ్చే ఆడదపడుచులకోసం ప్రత్యేక హాలు, అలాగే ఫీడింగ్ రూమ్, చిన్నపిల్లల కోసం క్రష్ సెంట‌ర్‌, వృద్ధుల కోసం ర్యాంప్ సౌక‌ర్యం, వీల్ చైర్ స‌దుపాయం, లిఫ్ట్‌, పార్కింగ్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా 300 కార్లకు పార్కింగ్ స‌దుపాయం, గ్రీన్ బిల్డింగ్, సోలార్ సిస్టమ్, కేఫ్ ఏర్పాటు చేయనున్నారు.

Next Story