తెలంగాణలో సొంతిళ్లు లేని కుటుంబం ఉండొద్దు.. అదే మా సంకల్పం

by Gantepaka Srikanth |

తెలంగాణలో సొంతిళ్లు లేని కుటుంబం ఉండొద్దు.. అదే మా సంకల్పం

తెలంగాణలో సొంతిళ్లు లేని కుటుంబం ఉండొద్దు.. అదే మా సంకల్పం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రతీ కుటుంబం ఉన్నతమైన ప్రమాణాలతో నివసించేందుకు అనువైన సొంత ఇంటి వసతిని కల్పించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా మంగళవారం ‘అఫర్డ్ బుల్ హౌసింగ్ పాలసీ ఫర్ అర్భన్ ఫ్యూచర్ - తెలంగాణ మోడల్ 2047’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో మంత్రి మాట్లాడారు. ముఖ్యంగా అన్నివర్గాల ప్రజలకు అనువుగా ఉండే ధరల్లో ఒక సమగ్ర విధాన రూపకల్పనకు తెలంగాణ రైజింగ్ 2047- గ్లోబల్ సమ్మిట్ చక్కటి వేదిక అని ఆయన పేర్కొన్నారు. పెరుగుతున్న పట్టణీకరణతోపాటు, విస్తృతమవుతున్న గృహ అవసరాలను దృష్టిలో ఉంచుకుని దేశానికి ఆదర్శంగా ఉండేలా ఆర్థికంగా సాధ్యమైన, పర్యావరణ పరిరక్షణకు అనుగుణమైన, సాంకేతికత ఆధారిత అంశాలు ఉండేలా సమగ్రమైన పాలసీని రూపొందిస్తున్నామని వివరించారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించనున్న విధానాలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రోల్ మోడల్‌గా నిలుస్తాయని వెల్లడించారు.

వివిధ దశల్లో ఇళ్ల నిర్మాణాలు

గతంలో ఇందిరమ్మ పథకం ద్వారా సుమారు 42 లక్షల ఇండ్లను నిర్మించగా, ఇప్పడు ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమంలో భాగంగా సుమారు 3.5 లక్షల ఇళ్ల నిర్మాణాలు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు. అంతేకాకుండా మధ్య తరగతి కుటుంబాల కోసం హౌసింగ్ బోర్డ్, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ తదితర సంస్థల ద్వారా సుమారు లక్ష ఇళ్లు నిర్మించినట్లు వివరించారు. రాష్ట్రంలో గృహాల డిమాండ్, సరఫరా మధ్య భారీ అంతరం ఉన్నదని, ఈ అంతరాన్ని పూడ్చడానికి, వ్యక్తిగత పథకాలకు పరిమితం కాకుండా, ప్రభుత్వ లక్ష్యానికి మూలస్తంభం లాంటి తెలంగాణ- 2047ను ఆదాయంతో సంబంధం లేకుండా ఒక సమగ్ర గృహ నిర్మాణ విధానాన్ని రూపొందిస్తున్నామని ప్రకటించారు.

పట్టణాలపై ప్రత్యేక దృష్టి

పట్టణ ప్రాంతాల అవసరాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి, సమతుల్యతతో కూడిన గృహ నిర్మాణ తెలంగాణ నమూనా 2047 వైపు చారిత్రక అడుగు వేస్తున్నామని మంత్రి పొంగులేటి చెప్పారు. ఈ నమూనా తప్పనిసరిగా ఆర్థికంగా లాభదాయకంగా, సామాజికంగా సమ్మిళితంగా, పర్యావరణపరంగా బాధ్యతాయుతంగా, సాంకేతికత ఆధారితంగా ఉండాలని తమ ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ప్రభుత్వ ప్రవేట్ భాగ్యస్వామ్యంతో ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్డు మధ్యలో పేద మధ్యతరగతి ప్రజల కోసం కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ తరహాలో ఇళ్లను నిర్మించాలన్న ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. ప్రధానంగా తెలంగాణను మూడు ప్రధాన ప్రాంతాలుగా విభజించి వ్యూహాలను రూపొందించామని తెలిపారు. తెలంగాణ కోర్ అర్బన్ ప్రాంతం మురికివాడల యథాస్థితి పునరాభివృద్ధి, ఐటీ కారిడార్లలో అందుబాటు అద్దె గృహ నిర్మాణం, రవాణా కారిడార్ల వెంబడి గృహాల ఏర్పాటు, పరి-అర్బన్ ప్రాంతం (ప్యూర్) ప్లాన్డ్ టౌన్‌షిప్‌లు, భారత్ సిటీ వంటి గ్రీన్‌ఫీల్డ్ శాటిలైట్ టౌన్‌లు, పారిశ్రామిక ప్రాంతాలలో కార్మికుల గృహ వసతి, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలు చిన్న/మధ్య తరహా టౌన్‌షిప్‌లు, పారిశ్రామిక పార్కులు, లాజిస్టిక్స్ హబ్‌లతో అనుసంధానించబడిన అద్దె/కార్మికుల గృహ నిర్మాణం ప్ర‌ధాన వ్యూహాలుగా త‌యారుచేశామని స్పష్టం చేశారు. అన్నివర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సమగ్రమైన అఫర్డ్ బుల్ హౌజింగ్ పాలసీని తీసుకొస్తున్నట్లు చెప్పారు. కొత్తగా రూపొందించనున్న అఫర్డబుల్ హౌసింగ్ పాలసీలో ఇటీవల ప్రకటంచిన క్యూర్, ప్యూర్, రేర్ జోన్లకు అనుగుణంగా అనుసరించాల్సిన విధానాలను నిర్దేశించనున్నామని వెల్లడించారు. ఈ సెమినార్‌లో ప్రపంచ బ్యాంకు ప్రతినిధి అభిజిత్ శంకర్ రే, రాంకీ సీఎండీ నంద కిషోర్, హడ్కో ఎండీ వి.సురేశ్, క్రెడాయ్ ప్రెసిడెంట్ జి.రామ్ రెడ్డి, ఏఎస్‌బీఎల్ సీఈవో అజితేష్, సీబీఆర్ఈ ప్రతినిధి ప్రీతం మెహెరా తదితరులు పాల్గొన్నారు.

Next Story