- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మార్చి 2027 నాటికి భూ రీ-సర్వే పూర్తి.. కలెక్టర్లకు మంత్రి పొంగులేటి డెడ్‌లైన్
తెలంగాణలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు భూ భారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే రాష్ట్ర వ్యాప్తంగా భూ రీ సర్వేను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు భూ భారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే రాష్ట్ర వ్యాప్తంగా భూ రీ సర్వేను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భూ రీ-సర్వే, భూ భారతి అమలు, సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం, ఇందిరమ్మ ఇండ్లు, రెండు పడక గదుల ఇళ్ల పంపిణీ, విద్యార్థుల యూనిఫాంల పంపిణీ, తదితర అంశాలపై మంత్రి శనివారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. హైదరాబాద్ నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లోకేష్ కుమార్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధరణిని రద్దు చేసి భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని, రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. భూ భారతి అమల్లోకి వచ్చి 15 నెలలు పూర్తయినా ప్రజల అంచనాలకు పూర్తిస్థాయిలో చేరలేకపోయామని తెలిపారు. ధరణి కాలంలో పెండింగ్‌లో ఉన్న 9.6 లక్షల సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం కోసం భూ భారతిలో అవకాశం కల్పించి, హైకోర్టు సమస్యలను పరిష్కరించినప్పటికీ, అధిక సంఖ్యలో దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయనే అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు. తిరస్కరణలకు గల కారణాలను గుర్తించి, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
భూ రీ-సర్వే తప్పనిసరి..
భూ భారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే భూ రీ-సర్వే తప్పనిసరి అని మేధావులు సూచించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇందుకోసం శిక్షణ పొందిన 5,700 మంది లైసెన్స్ సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలని, రెగ్యులర్ సర్వేయర్లు, లైసెన్స్ సర్వేయర్లు సమన్వయంతో పని చేయాలని సూచించారు. పైలట్ ప్రాజెక్టుగా నక్షాలు లేని 413 ప్రాంతాల్లోని ఐదు గ్రామాల్లో నిర్వహించిన రీ-సర్వేతో 95 శాతం వరకు భూ సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు. శుక్రవారం ముఖ్యమంత్రి ఆయా గ్రామాల రైతులకు కొత్త పట్టాదారు పాస్‌బుక్‌లు పంపిణీ చేశారని గుర్తు చేశారు. తొలి విడతలో ప్రతి జిల్లాలో 70 గ్రామాలను ఎంపిక చేసి రీ-సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. రీ-సర్వేకు అవసరమైన అత్యుత్తమ నాణ్యత గల పరికరాలను జిల్లా స్థాయిలో కొనుగోలు చేయాలని, కొనుగోలు ముందు రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. కలెక్టర్లు భూ రీ-సర్వేను అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకొని, అవసరమైన సిబ్బంది, పరికరాలు, మౌలిక వసతులు సమకూర్చాలని ఆదేశించారు. ప్రతి నెల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పురోగతిని సమీక్షిస్తామని, మార్చి-2027 నాటికి మూడు విడతల్లో రీ-సర్వే పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రీ-సర్వేలో పనిచేసే లైసెన్స్ సర్వేయర్లకు ఎకరానికి రూ. 50తో పాటు రవాణా, ఇతర ఖర్చుల కోసం మరో రూ.10 చెల్లించి మొత్తం రూ.60 అందజేస్తామని తెలిపారు. చెల్లింపులు వెంటనే జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జూలై 28లోపు విధుల్లో చేరని లైసెన్స్ సర్వేయర్ల లైసెన్సులు రద్దు చేయాలని ఆదేశించారు. వారికి బీమా, సామాజిక భద్రత కల్పించే చర్యలు కూడా తీసుకుంటామని వెల్లడించారు. ఒక సర్వే నంబరులో కొంత భూమి మాత్రమే ప్రభుత్వ అవసరాలకు సేకరించినప్పటికీ మొత్తం భూమిని నిషేధిత జాబితాలో ఉంచడం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సాదాబైనామా దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిష్కరించి, నోటీసులు త్వరితగతిన జారీ చేయాలని సూచించారు. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని, పెండింగ్‌లో ఉన్న 2బీహెచ్‌కే ఇళ్లను ప్రస్తుత స్థితిలోనే లబ్ధిదారులకు అందజేసి, మిగిలిన పనులకు అనంతరం నిధులు విడుదల చేయాలని ఆదేశించారు.
నిధులు విడుదలైనా పనులు చేపట్టని చోట్ల బాధ్యులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని స్పష్టం చేశారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను వెంటనే పూర్తి చేసి గుడిసెల్లో నివసించే కుటుంబాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, మొదటి విడతలో మంజూరు కాని అర్హుల ఇళ్లను కూడా రెండో విడతలో చేర్చి మంజూరు చేయాలని సూచించారు. ఇసుక, కంకర సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.






