తిరుమ‌ల‌గిరిలో 3 వేల మంది అనర్హులు.. అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశం

by Gantepaka Srikanth |

పేద ప్రజలు ద‌శాబ్దాల కాలంగా సాగు చేసుకుంటున్న భూములపై వారికి హక్కులు కల్పించే విషయంలో మానవీయ కోణంలో ఆలోచన చేయాల‌ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అధికారుల‌కు సూచించారు.

తిరుమ‌ల‌గిరిలో 3 వేల మంది అనర్హులు.. అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: పేద ప్రజలు ద‌శాబ్దాల కాలంగా సాగు చేసుకుంటున్న భూములపై వారికి హక్కులు కల్పించే విషయంలో మానవీయ కోణంలో ఆలోచన చేయాల‌ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అధికారుల‌కు సూచించారు. స‌చివాల‌యంలో మంగ‌ళ‌వారం నాగార్జున సాగర్ నియోజకవర్గంలో భూ స‌మ‌స్యల‌పై అట‌వీ శాఖ మంత్రి కొండా సురేఖతో క‌లిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చిన్న చిన్న స‌మ‌స్యల‌ను సాకుగా చూపించి జ‌ఠిలం చేయొద్దని అట‌వీశాఖ అధికారుల‌కు సూచించారు. నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో 40-50 సంవ‌త్సరాల నుంచి సాగు చేసుకుంటున్న భూముల‌పై గిరిజ‌నుల‌కు హ‌క్కులు క‌ల్పించ‌డానికి త‌మ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంద‌ని, ఐతే నిబంధ‌న‌లు చూపుతూ ఆ భూములు అట‌వీ శాఖకు చెందిన‌వ‌ని అధికారులు కొర్రీ వేస్తున్నార‌న్నారు. ఈ అంశంపై రెవెన్యూ, ఫారెస్ట్ విభాగాలు స‌మ‌న్వయంతో ప‌ని చేసి వీలైనంత త్వర‌గా ప‌రిష్కారం చూపేలా చ‌ర్యలు తీసుకోవాల‌న్నారు.

భూభారతిలో పైలెట్

భూ భార‌తి పైల‌ట్ ప్రాజెక్ట్‌లో భాగంగా నాగార్జున సాగ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలోని తిరుమ‌లగిరి మండ‌లాన్ని ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా స‌ర్వే నిర్వహించినట్లు మంత్రి పొంగులేటి చెప్పారు. ఈ పైల‌ట్ ప్రాజెక్ట్ కోసం 235 స‌ర్వే నెంబ‌ర్లను ఎంపిక చేశామన్నారు. మొత్తం 23 వేల ఎక‌రాలో స‌ర్వే నిర్వహించ‌గా, అందులో 12 వేల ఎక‌రాలు ప్రభుత్వ భూమిగా గుర్తించామన్నారు. ఇందులో 8 వేల ఎక‌రాలు సాగుకు అనుకూలంగా ఉన్నాయ‌న్నారు. వాటిలో 4 వేల ఎక‌రాలు పాసు పుస్తకాల‌తో సాగులో ఉన్నాయ‌ని వివ‌రించారు. మిగిలిన 4037 ఎక‌రాల‌కు సంబంధించి కొత్త పాసు పుస్తకాలు ఇవ్వవ‌ల‌సి ఉంద‌న్నారు. ఈ స‌ర్వేలో 2936 ఎక‌రాల‌కు సంబంధించి 3069 మంది వ‌ద్ద బోగ‌స్ పాసు పుస్తకాలు ఉన్నట్లు గుర్తించి వారి పాసు పుస్తకాల‌ను ర‌ద్దు చేశామ‌ని తెలిపారు. వీరికి రైతు భ‌రోసా, రైతు బీమా త‌దిత‌రాల‌ను ర‌ద్దు చేశామ‌న్నారు. స‌ర్వేలో భాగంగా 7 వేల ఎక‌రాలు అట‌వీ భూమిని గుర్తించామ‌ని, ఈ భూముల‌కు సంబంధించిన వివాదాల‌ను వీలైనంత త్వరిత‌గ‌తిన ప‌రిష్కరించాల‌ని అధికారుల‌కు సూచించారు. సమావేశంలో మాజీ మంత్రి కె.జానా రెడ్డి, నాగార్జున సాగర్ శాసన సభ్యులు కె.జ‌య‌వీర్ రెడ్డి, దేవ‌ర‌కొండ శాస‌న‌స‌భ్యులు బాలూ నాయిక్‌, రెవెన్యూ శాఖ సెక్రటరీ డీఎస్ లోకేష్ కుమార్, పీసీసీఎఫ్ సి.సువ‌ర్ణ, నల్గొండ కలెక్టర్ ఐలా త్రిపాఠి పాల్గొన్నారు.

Next Story