కడుపులో విషం, నోట్లో అబద్ధాలు.. బీఆర్ఎస్ పై మంత్రి పొంగులేటి ఫైర్

by Prasad Jukanti |

ఖమ్మం జిల్లా ప్రజలు బీఆర్ఎస్‌ను ఆదరించలేదనే కక్షతో సీతారామ ప్రాజెక్టును గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని మంత్రి పొంగులేటి మండిపడ్డారు.

కడుపులో విషం, నోట్లో అబద్ధాలు.. బీఆర్ఎస్ పై మంత్రి పొంగులేటి ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీని ఉమ్మడి ఖ‌మ్మం జిల్లా ప్రజ‌లు ఎప్పుడూ స‌రిగా ఆద‌రించ‌డంలేద‌న క‌క్షతో అత్యంత కీల‌క‌మైన సీతారామ ప్రాజెక్ట్‌తో పాటు ప‌లు నీటి ప్రాజెక్ట్‌ల‌ను ఆ పార్టీ నాయ‌కులు గాలికి వ‌దిలేశార‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి గారు దుయ్యబ‌ట్టారు. గురువారం డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో క‌లిసి ఖ‌మ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్ట్‌ను మంత్రి సంద‌ర్శించారు. ప్రాజెక్ట్ సంద‌ర్శన అనంత‌రం ఏర్పాటైన పాత్రికేయుల స‌మావేశంలో పొంగులేటి మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ ప‌రిస్ధితిని చూస్తే క‌డుపుత‌రుక్కుపోతోంద‌న్నారు. గ‌తంలో బీఆర్ఎస్ పార్టీకి ఈ ప్రాంతీయులు ఓట్లు వేసి సీట్లు ఇవ్వనందున గిరిజ‌నులు అధికంగా ఉండే కొత్తగూడెం, ఖ‌మ్మం జిల్లాల‌కు ఉప‌యుక్తమైన సీతారామ ప్రాజెక్ట్‌కు అన్యాయం చేశారని ఆరోపించారు. ప్రతిప‌క్షపాత్ర పోషించాల్సిన బీఆర్ఎస్ పెద్దలు క‌డుపులో విషం పెట్టుకొని అబ‌ద్దాల‌తో కాలంగ‌డుపుతున్నారని మండిపడ్డారు. ప‌దేళ్ల పాల‌న‌లో ప్రజ‌ల క‌ష్టం గుర్తించ‌ని నాటి పెద్దలు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలా ప‌నిచేస్తుందో చూస్తూ జ్ఞానం తెచ్చుకోవాలని మంత్రి పొంగులేటి హిత‌వు ప‌లికారు.

భేషజాల‌కు పోవడం లేదు:

ఆనాడు వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో ప్రాజెక్ట్‌ల‌కు మ‌హ‌ర్ధశ ప‌ట్టిన‌ట్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంలో మ‌ళ్లీ వాటిని ద‌శ‌ల వారీగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఎటువంటి భేషజాల‌కు, ప‌ట్టుద‌ల‌కు పోకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం త‌ప్పు చేసినా సీతారామ ప్రాజెక్ట్ తో పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను స‌రిదిద్దే త‌ప‌న‌తో ప‌నిచేస్తున్నామన్నారు. వారు క‌ట్టార‌ని కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను వ‌దిలేయం, గిరిజ‌నుల‌కు ఉప‌యోగ‌ప‌డే సీతారామ ప్రాజెక్ట్ ల ప్రాధాన్యత గుర్తించి ప్రజ‌ల క‌ష్టాల‌ను దృష్టిలో పెట్టుకొని పూర్తిగా అందుబాటులోకి తెస్తామన్నారు. ఉన్న నిధుల‌ను బీఆర్ఎస్ పెద్దలు కొల్లగొడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ లోటును భ‌ర్తీ చేస్తూ మ‌రోవైపు సంక్షేమ కార్యక్రమాలు కొన‌సాగిస్తోందన్నారు. రాష్ట్రంలో నీటిపారుద‌ల రంగం కుంటుప‌డ‌కుండా చ‌ర్యలు చేప‌డుతున్నామని, ఈ సీతారామ ప్రాజెక్ట్ కు గ‌తంలో 115 కోట్ల రూపాయిలు మాత్రమే ఖ‌ర్చుచేసి వ‌దిలేశారన్నారు ఇప్పుడు నిధులిస్తూ 1480 క్యూసెక్కుల నీటిని విడుద‌ల చేసి ఖ‌మ్మం, వైరా, స‌త్తుప‌ల్లి త‌దిత‌ర ప్రాంతాల‌కు తాగునీటిని కూడా అందిస్తున్నామన్నారు. 1.25 ల‌క్షల ఎక‌రాల‌కు సాగునీటిని విడుద‌ల చేస్తూ క‌రువు వ‌చ్చినా కాపాడేలా చేస్తున్నట్లు చెప్పారు. అవ‌స‌ర‌మైతే అద‌నంగా నీటిని విడుద‌ల చేస్తామన్నారు. రైతుల‌కు నీరు ఇవ్వాల‌న్న త‌ప‌న‌తో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయ‌క‌త్వంలో చాలా గ‌ట్టిగా ప‌నిచేస్తున్నామన్నారు.

Next Story