- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొడుక్కి ‘రామ్ ఖాన్’ అని పేరు పెట్టాలనుకున్నా.. కానీ: సోహైల్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
బాలీవుడ్ నటుడు, నిర్మాత సోహైల్ ఖాన్ తన పెద్ద కుమారుడి పేరు వెనక ఉన్న ఆసక్తికరమైన కథను అభిమానులతో పంచుకున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బాలీవుడ్ నటుడు, నిర్మాత సోహైల్ ఖాన్ తన పెద్ద కుమారుడి పేరు వెనక ఉన్న ఆసక్తికరమైన కథను అభిమానులతో పంచుకున్నారు. మొదట తన కొడుక్కి ‘రామ్ ఖాన్’ అని పేరు పెట్టాలని భావించానని, కానీ అది ‘నిర్వాన్’గా ఎలా మారిందో వెల్లడించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమవుతున్న ‘అలయన్స్’ (Alliance) రియాలిటీ షోలో కంటెస్టెంట్ అలీ గోనితో జరిగిన సరదా సంభాషణలో సోహైల్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు.
‘రామ్ ఖాన్’ కాస్తా నిర్వాన్ ఎలా అయ్యాడంటే?
సోహైల్, సీమా దంపతులు తమ పిల్లలను పెంచుతున్న విధానాన్ని అలీ గోని మెచ్చుకోగా, సోహైల్ స్పందిస్తూ.. ‘మాకు కొడుకు పుడితే నేను, కూతురు పుడితే సీమా పేరు పెట్టాలని డెలివరీకి ముందే ఓ ఒప్పందం చేసుకున్నాం. మా కుటుంబ లౌకిక విలువల (Secular values) నేపథ్యంలో బాబుకు ‘రామ్ ఖాన్’ అని పేరు పెట్టాలని నేను నిర్ణయించుకున్నా. అయితే, డెలివరీ తర్వాత స్పృహలోకి వచ్చిన సీమా.. మొదట అడిగిన మాట ‘నిర్వాన్ ఎలా ఉన్నాడు?’ అని. ఆ క్షణంలోనే ఆ పేరు నాకు ఎంతో నచ్చేసింది. ఇక దాన్ని మార్చాల్సిన అవసరం రాలేదు. ఆ పేరుకు తగ్గట్లే వాడు ఇప్పుడు చాలా ప్రశాంతంగా, బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాడు’ అని సోహైల్ చెప్పుకొచ్చారు.
ఎమోషనల్ అయిన సోహైల్
25 ఏళ్ల సుదీర్ఘ దాంపత్య జీవితం తర్వాత సోహైల్, సీమా సజ్దే 2022లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే విడిపోయినప్పటికీ, ఈ షోలో వీరిద్దరూ ఎంతో స్నేహపూర్వకంగా మెలుగుతున్నారు. విడాకులకు దారితీసిన పరిస్థితులపై సోహైల్ స్పందిస్తూ.. ‘ఆ సమయంలో నా కెరీర్ ఒడిదుడుకుల్లో ఉంది. మానసికంగా నేను సరైన స్థితిలో లేను. నా ప్రవర్తన వల్లే నేను అమితంగా ప్రేమించిన వ్యక్తిని కోల్పోయాను. మా బంధంలో ఏవైనా లోపాలు ఉంటే దానికి పూర్తి బాధ్యత నాదే. నా ఇద్దరు పిల్లల తల్లి అయిన సీమాపై ఇప్పుడు నాకున్న ప్రేమ కంటే గౌరవమే ఎక్కువ’ అని అన్నారు.
2 దశాబ్దాల ప్రేమకథ..
వీరిద్దరి ప్రేమ కథ ఎంతో ఆసక్తికరమైనది. చంకీ పాండే ఎంగేజ్ మెంట్ లో సీమాను తొలిచూపులోనే ప్రేమించిన సోహైల్.. మతాలు వేరు కావడంతో కుటుంబాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. అయినప్పటికీ పెద్దలను ఎదిరించి మరీ 1998 మార్చి 15న ఆర్యసమాజ్‌లో, ఆ తర్వాత నికాహ్ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. వీరికి నిర్వాన్ (2000), యోహాన్ (2011) అని ఇద్దరు కుమారులు.






